AP Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..!
AP Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈరోజు (ఆగస్టు 15 ) నుంచి ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రారంభమైన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు, నారా లోకేష్, మాధవ్‌లతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, మహిళల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం మహిళలతో పాటు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

AP Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..!
ఈ పథకం కింద పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, లగ్జరీ సర్వీసులైన అల్ట్రా డీలక్స్, సూపర్ డీలక్స్, స్టార్ లైనర్ ఏసీ బస్సులు, తిరుమలకు వెళ్లే సప్తగిరి బస్సులు, నాన్-స్టాప్ బస్సులు మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు ఈ పథకం వర్తించదు. ఈ సదుపాయాన్ని పొందాలంటే ప్రయాణికులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను గుర్తుపెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత ప్రయాణం సాగించవచ్చు.
‘స్త్రీ శక్తి’ పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు అందించనున్నారు. ఉచిత ప్రయాణం కారణంగా బస్సులు, బస్టాండ్లలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, బస్టాపుల వద్ద మౌలిక వసతులను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు