YS Sharmila : షర్మిళ- జగన్ మధ్య వారసత్వ పోరు.. ఈ సారి షర్మిళ తనకు అనుకూలంగా మలచుకోనుందా?
YS Sharmila : ఈ సారి ఏపీ ఎన్నికలలో షర్మిళ- జగన్ మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా సాగింది. అన్నా, చెల్లెళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇక ఇప్పుడు వైఎస్‌ఆర్ వారసత్వంపై.. ప్రస్తుతం అన్నా చెల్లెల్ల మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పటి వరకు అటు షర్మిల.. ఇటు జగన్.. ఎవరికి వారు ఇడుపుల పాయ వెళ్లి..వైఎస్‌కు నివాళి అర్పించేవారు. కానీ ఇప్పుడు తొలిసారి వైఎస్ జయంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిళ. జులై 8.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఆ రోజు వైఎస్‌ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు.
YS Sharmila అన్నా చెల్లెళ్ల మధ్య ఫైట్
ఇప్పటి దాకా వైఎస్ వారసత్వాన్ని, ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్‌కు..ఇకపై గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు షర్మిల. వైఎస్ జగన్, షర్మిల ఇద్దరూ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులే. కష్టాల్లో ఉన్న అన్నకు అండగా నిలబడటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల.. వైఎస్సార్సీపీ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అయితే అన్నతో దూరం పెట్టడంతో కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిల.. వైఎస్ తనయగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే బాధ్యతను తన తలపైకి ఎత్తుకుంది. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ అభిమానులను గతంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి హస్తం వైపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
జులై 8న విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వంటి కీలక నేతలను స్వయంగా ఆహ్వానించారు..షర్మిల. మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తుంది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులని వైఎస్ జయంతి వేడుకల ద్వారా తిరిగి ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఇక ఈ నెల 8న వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఇడుపుల పాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించనున్నారు..మాజీ సీఎం వైఎస్ జగన్.