YS Jagan Mohan Reddy : ఆ మూడు వ్యూహాలతో ప్రజలను తన వైపు తిప్పుకుంటున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
YS Jagan Mohan Reddy : ఆ మూడు వ్యూహాలతో ప్రజలను తన వైపు తిప్పుకుంటున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!
YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో వంద రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే అప్పటికి ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది..ఎవరి వైపు మొగ్గు చూపుతారు..అనే విషయాలు చెప్పడం కష్టం. సహజంగా ఇదే అభిప్రాయం విశ్లేషకులకు కూడా ఉంటుంది. కానీ ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజానాడిని ముందుగానే పసిగట్టినట్లు తెలుస్తోంది. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు.. ఎలాంటి ఫలితం ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయాల పైన ఆయన స్పష్టతతో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా తన దారిలో తాను పయనిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి మూడు వ్యూహాలను అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.ఒకటి సెంటిమెంటు. రెండు ప్రతిపక్షాలను కట్టడి చేయడం. మూడు ఓటర్ల జాబితా పైన తనదైన ముద్ర వేయడం అని విశ్లేషకులు చెబుతున్న మాట.
మొదటి విషయాన్ని తీసుకుంటే ఇటీవల కాలంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రసంగించిన మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయండి అంటూ సెంటిమెంటును ప్రజలపై రుద్దుతున్న విషయం తెలిసిందే. అమ్మ ఒడి, రైతు భరోసా, చేదోడు,డ్వాక్రా రుణాలు ఇలా కొన్ని పథకాల వలన ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఈ పథకాలలో ఏదో ఒకటి ప్రతి కుటుంబానికి అందుతుంది. దీంతో ఆయా వర్గాలను తన వైపుకు తిప్పుకొనే ప్రయత్నం ఆయన చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.ఇక రెండవది విపక్షాలను కట్టడి చేయడం. ఇది కూడా చంద్రబాబును జైల్లో పెట్టడం, విపక్ష నాయకులపై కేసులు పెట్టడం వంటి వాటిని గమనిస్తే తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా కీలకమైన ఎన్నికల ముందు ప్రతిపక్షాల వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కార్యక్రమమేనని చెబుతున్నారు. దీనివలన ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది పరిశీలకులు చెబుతున్న మాట.
ఇక మూడో అంశంగా ఓటర్ల జాబితాను ప్రభావితం చేయడం. ఈ క్రమంలో డోర్ నెంబర్ లు లేని, మరణించిన వారి ఓట్లు కూడా టార్గెట్ అవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల ఓటర్ల ముసాయిదా జాబితాలో ఇలాంటి వారి ఓట్లే ఎక్కువగా ఉన్నాయని తేలింది. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు గల్లంత అయ్యాయని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. అయితే ఇదంతా కూడా చాలా ప్లాన్ గా జరుగుతున్నదేనని, ప్రజానాడిని ముందుగానే వై.యస్.జగన్మోహన్ రెడ్డి పసిగట్టారని, తనదైన శైలిలో అనుకూలతను పెంచుకునే చర్యలు ప్రారంభించారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ విషయాన్ని విపక్షాలు, ప్రజలు గ్రహించలేకపోతున్నారు అనేది వాదన.