Ya Jagan : వారికి టికెట్ ఇవ్వను.. వైసీపీ నేతలకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Ya Jagan : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరి పనితీరును నిశితంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు
Ya Jagan : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరి పనితీరును నిశితంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎక్కడైనా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లను మార్చేస్తానని హెచ్చరించారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పనితీరును చూస్తా. ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. అలా జరిగితే.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లను మార్చేస్తా” అని జగన్ పార్టీ నాయకులకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. అదే సమయంలో ఏకగ్రీవాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ నేతలను అప్రమత్తం చేశారు.
Ya Jagan : వారికి టికెట్ ఇవ్వను.. వైసీపీ నేతలకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Ya Jagan స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.. జగన్ దిశానిర్దేశం
నియోజకవర్గ సమన్వయకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ సూచించారు. ప్రస్తుతం వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన పరిస్థితి నుంచి పార్టీ బయటపడేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా ఉపయోగపడతాయని ఆయన నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎవరైనా స్థానిక ఎన్నికల విషయంలో నిర్లక్ష్యం వహించినా, వాటిని తేలికగా తీసుకున్నా సహించేది లేదని జగన్ స్పష్టం చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరి పనితీరు పార్టీ భవిష్యత్తులో వారి ప్రాధాన్యతను నిర్ణయించే అంశంగా ఉంటుందని పేర్కొన్నారు. జగన్-2.0 యాప్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను నమోదు చేయాలని కూడా జగన్ సూచించారు. పార్టీ పరంగా అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామని నేతలకు భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అయితే సమస్యలు ఉన్నాయనే కారణంతో ఇంట్లో కూర్చోవడం మాత్రం కుదరదని జగన్ తేల్చిచెప్పారు. ప్రతి నాయకుడు వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఈ స్థానిక ఎన్నికలు అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ కోసం సమర్థంగా పనిచేసే నాయకుల పనితీరును గుర్తు పెట్టుకుంటామని, భవిష్యత్తులో వారికి తగిన పదవులు కల్పించే విషయంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు సమాచారం.మరోవైపు మరో మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులపై జగన్ హెచ్చరిక.. “ప్రతి ఒక్కరి పేరును గుర్తుపెట్టుకుంటున్నాం”
సమావేశంలో పోలీసుల వ్యవహారంపైనా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వేధింపులను తట్టుకుని నాయకులు ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకులు నిర్దిష్ట విధానాన్ని అవలంబిస్తూ రాజకీయంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.ప్రస్తుత ప్రభుత్వం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిళ్లకు వెనక్కి తగ్గకుండా ప్రజల్లో ఉండాలని, పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.
ఇదే సమయంలో పోలీసులకు కూడా జగన్ హెచ్చరికలు చేసినట్లు సమాచారం. మరో మూడేళ్ల తర్వాత తమ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తమను వేధిస్తున్న అధికారుల పేర్లను గుర్తుపెట్టుకుంటున్నామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారు ఎక్కడ ఉన్నా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.మొత్తంగా చూస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్నిర్మాణానికి కీలకమైన పరీక్షగా చూస్తున్నట్లు ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏకగ్రీవాల విషయంలో ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరే భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్లు, పార్టీ పదవుల విషయంలో కీలకంగా మారుతుందన్న సంకేతాలను జగన్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.







