AP Railway : ఏపీ కి రైల్వే వరాలు..!
AP Railway
AP Railway : ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో సుమారు రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ప్రధాన మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల పరిధిలో ప్రయాణించే ప్రజలకు, అలాగే సరుకు రవాణా రంగానికి భారీగా ప్రయోజనం చేకూరనుంది. రైల్వే లైన్ల విస్తరణతో రైళ్ల రాకపోకలకు మరింత సామర్థ్యం పెరగడంతో పాటు, ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లపై రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది.
AP Railway : ఏపీ కి రైల్వే వరాలు..!
AP Railway 410 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు
కేంద్రం ఆమోదించిన ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా 410 కిలోమీటర్ల మేర మల్టీ-ట్రాకింగ్ లైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలకు కీలకమైన గుమ్మిడిపూడి–గూడూరు రైల్వే లైన్ కూడా ఉంది.
AP Railway ఆమోదం పొందిన నాలుగు ప్రాజెక్టులు ఇవే
ఖరగ్‌పూర్–భద్రక్ (రాణితాల్) 4వ లైన్: 173 కిలోమీటర్లు
గుమ్మిడిపూడి–గూడూరు 3వ, 4వ లైన్లు: 90 కిలోమీటర్లు
భద్రక్–హరిదాస్‌పూర్ 4వ లైన్: 75 కిలోమీటర్లు
కటక్–పారాదీప్ (బడబంధ) 3వ, 4వ లైన్లు: 72 కిలోమీటర్లు
ముఖ్యంగా గుమ్మిడిపూడి–గూడూరు మధ్య 3వ, 4వ లైన్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల రైల్వే కనెక్టివిటీకి కీలకంగా మారనుంది.
60 లక్షల మందికి నేరుగా ప్రయోజనం
ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలు మరింత వేగంగా సాగడంతో పాటు పట్టాలపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రైల్వే విస్తరణ ద్వారా సుమారు 6,448 గ్రామాలకు చెందిన దాదాపు 60 లక్షల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు స్వయం సమృద్ధికి కూడా తోడ్పాటు లభించనుంది. అదే సమయంలో కొత్తగా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణికుల రవాణాతో పాటు పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు కూడా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి.
పర్యాటకానికి బూస్ట్.. సరుకు రవాణా మరింత వేగం
కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. నేలపట్టు పక్షుల కేంద్రం, పులికాట్ సరస్సు, భితర్కనిక నేషనల్ పార్క్, కుల్దిహా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, చండీపూర్ బీచ్, లలితగిరి బౌద్ధ క్షేత్రం, లార్డ్ వీరరాఘవ పెరుమాళ్ కోవెల, దబలేశ్వర్ ఆలయం వంటి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.ఇక సరుకు రవాణా విషయంలోనూ ఈ ప్రాజెక్టులు కీలక మార్పులు తీసుకురానున్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్, ధాన్యాలు వంటి కీలక సరుకులను వేగంగా తరలించేందుకు అదనపు రైల్వే సామర్థ్యం ఉపయోగపడనుంది.
ఈ నాలుగు ప్రాజెక్టులు పూర్తయితే ప్రతి సంవత్సరం అదనంగా 76 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా నిర్వహించే సామర్థ్యం ఏర్పడనుందని కేంద్రం తెలిపింది.రైలు రవాణా పెరగడం వల్ల పర్యావరణానికి కూడా ప్రయోజనం కలగనుంది. ఏటా సుమారు 13 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉండటంతో పాటు, దాదాపు 65 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని కేంద్రం పేర్కొంది. ఈ స్థాయిలో కార్బన్ ఉద్గారాల తగ్గింపు దాదాపు 2.60 కోట్ల చెట్లను నాటడంతో సమానం అని వివరించింది.మొత్తంగా చూస్తే.. రూ.9,450 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా, పర్యాటకం, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ వంటి పలు రంగాలకు ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా ఏపీ–తమిళనాడు ప్రాంతాలకు కీలకమైన గుమ్మిడిపూడి–గూడూరు రైల్వే లైన్‌కు ఆమోదం లభించడం ఈ ప్రాంతాల రైల్వే కనెక్టివిటీకి ప్రాధాన్యతను పెంచనుంది.







