Ysrcp : బలం కూడగట్టుకున్న వైసీపీ .. గట్టి ప్లానింగ్..!
Ysrcp ఉపాధ్యాయుల దినోత్సవం (గురు పూజోత్సవం) సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Ysrcp : ఉపాధ్యాయుల దినోత్సవం (గురు పూజోత్సవం) సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ రాజకీయ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియలో తీవ్రస్థాయిలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ‘గురు పరిరక్షణ దీక్ష’ను నిర్వహించారు. డీఎస్సీ టీచర్ నియామకాలపై తక్షణమే నిష్పాక్షికమైన సీబీఐ విచారణ జరిపించాలని, నకిలీ పత్రాలతో చేరిన అనర్హులను వెంటనే గుర్తించి ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని, ఈ మొత్తం వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు.
Ysrcp : బలం కూడగట్టుకున్న వైసీపీ .. గట్టి ప్లానింగ్..!
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఈ నిరసన కార్యక్రమం అత్యంత ఉధృతంగా సాగింది. ఈ దీక్షలో పార్టీ ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్‌బాబు, ఇసాక్, కల్పలత రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్‌కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చేతబూని తమ నిరసనను వ్యక్తం చేశారు. రావడం కష్టమనుకున్న పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు తానేటి వనిత, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, పేర్ని నానితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఒకే వేదికపైకి వచ్చి ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Ysrcp నోటిఫికేషన్ నుంచి నియామకాల దాకా అక్రమాలే: వైవీ సుబ్బారెడ్డి, కన్నబాబు ధ్వజం
ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న దారుణాలపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని నినదించారు. డీఎస్సీ అవకతవకలకు సంబంధించి రోజుకో నూతన అంశం తెరపైకి వస్తోందని, తప్పుడు అర్హతలతో అనర్హులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని సాక్షాత్తూ ప్రభుత్వమే అంగీకరించిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు నాలుగు, ఐదు జిల్లాల్లో లోలోపల రహస్యంగా విచారణలు సాగిస్తున్నారంటూ పత్రికల్లో కథనాలు వెలువడుతుండటమే ఈ నియామక ప్రక్రియ ఎంతటి లోపభూయిష్టంగా, అవినీతిమయంగా సాగిందో చెప్పకనే చెబుతోందన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి తుది నియామక పత్రాలు అందించేంత వరకు ప్రతీ దశలోనూ అక్రమాలు జరిగాయని, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడంతో పాటు రిజర్వేషన్లను సైతం దుర్వినియోగం చేసి ఉద్యోగాలు కొట్టేశారని మండిపడ్డారు.
మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కొందరు కాసుల కక్కుర్తి కోసం సాగించిన ఈ అక్రమాల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల, భావితరాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని, విద్యార్థులను సన్మార్గంలో నడిపించే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి నకిలీలను చొప్పిస్తే విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. గురుకుల, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే చర్యలు క్షమించరానివని స్పష్టం చేశారు. ఆధారాలతో సహా అక్రమాలను బయటపెడుతున్నా కూటమి సర్కార్‌లో కనీస చలనం లేకపోవడం దారుణమని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర దర్యాప్తు ద్వారా అర్హులైన నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీ కాస్తా అక్రమాల పుట్టగా మారింది: తానేటి వనిత ఎద్దేవా
మాజీ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతల గొప్పలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రాష్ట్ర చరిత్రలో తాము తప్ప మరెవరూ మెగా డీఎస్సీని నిర్వహించలేరు’ అంటూ ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రజల ముందు డాంబికాలు పలికారని ఎద్దేవా చేశారు. తామేదో అద్భుతం చేస్తున్నట్లు విర్రవీగిన నేతల అసలు రంగు ఇప్పుడు బట్టబయలైందని విమర్శించారు. నేడు బయటకు వస్తున్న వాస్తవాలను చూస్తే ఈ నియామకాల పర్వం మొత్తం అక్రమాల పుట్టగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిజంగా నిష్కళంకమైన పద్ధతిలోనే నియామకాలు చేపట్టి ఉంటే, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు ఎందుకు జంకుతున్నారని సూటిగా ప్రశ్నించారు.







