Ys jagan : జగన్ పాదయాత్ర ఎక్కడైతే.. అక్కడే లోకేష్ కౌంటర్? టీడీపీ మాస్టర్ ప్లాన్..!
Ys jagan ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2027లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టబోతున్నారనే ప్రచారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో మొదలైంది.
Ys jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2027లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టబోతున్నారనే ప్రచారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో మొదలైంది. జగన్‌కు పాదయాత్ర కొత్త విషయం కాదు. ఆయన రాజకీయ జీవితంలో పాదయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములాను నమ్ముకుంటున్నారనే చర్చ సాగుతోంది. 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు ఏణ్ణర కాలం పాటు సాగిన ఆ పాదయాత్ర తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని జగన్‌ను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. దీంతో పాదయాత్ర తనకు కలిసొచ్చిన రాజకీయ వ్యూహంగా జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.ఈసారి మాత్రం జగన్ తన పాదయాత్రను మరింత ముందుగానే ప్రారంభించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నికలకు సుమారు ఏణ్ణర సంవత్సరం ముందు పాదయాత్ర చేపట్టగా.. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందుగానే ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Ys jagan : జగన్ పాదయాత్ర ఎక్కడైతే.. అక్కడే లోకేష్ కౌంటర్? టీడీపీ మాస్టర్ ప్లాన్..!
Ys jagan : 5 వేల కిలోమీటర్లు.. గ్రామాలే టార్గెట్‌గా జగన్ పాదయాత్ర?
గతంలో జగన్ సుమారు 3,700 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అయితే ఈసారి దాదాపు 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర లక్ష్యంగా పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి పాదయాత్ర ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల మీదుగా సాగనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 17,300కు పైగా గ్రామాలు ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి. రెండేళ్ల కాలాన్ని సుమారుగా 730 రోజులకు లెక్కిస్తే.. మధ్యలో అవసరమైన విశ్రాంతి, విరామాలు తీసుకున్నప్పటికీ రోజుకు సగటున మూడు గ్రామాలను కవర్ చేసేలా జగన్ పాదయాత్రను డిజైన్ చేస్తున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి.వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లోనే బలమైన ఓటు బ్యాంక్ ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వర్గాలు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైసీపీ అంచనా వేస్తోంది. రైతులు, చిన్న వృత్తులపై ఆధారపడే వర్గాలు, ఇతర సామాజిక వర్గాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక, రాజకీయ సమీకరణాలు కూడా తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నమ్ముతోంది.
అందుకే ఈసారి జగన్ పాదయాత్రను పూర్తిగా పల్లెలను కేంద్రంగా చేసుకుని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడం, గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించడం, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవడం.. ఇలా పాదయాత్రను రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే జగన్ పాదయాత్ర ఒక్కటే వైసీపీకి విజయాన్ని అందిస్తుందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కేవలం వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మాత్రమే నమ్ముకోలేదు.చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అప్పట్లో తనకంటూ ప్రత్యేకమైన అభివృద్ధి, సంక్షేమ అజెండాను ప్రజల ముందుకు తీసుకెళ్లింది. అమరావతి రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలతో పాటు.. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామంటూ సూపర్ సిక్స్ హామీలను ప్రధానంగా ప్రచారం చేసింది. ఈ వ్యూహం వైసీపీని డిఫెన్స్‌లోకి నెట్టడంతో 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.
Ys jagan వైసీపీపై యాంటీ ఇన్‌కంబెన్సీ.. కూటమికి లోకేష్ కౌంటర్ వ్యూహం?
ఇప్పుడు వైసీపీ మరోసారి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని చూస్తోందనే చర్చ ఉంది. సాధారణంగా ఒక ప్రభుత్వం కొంతకాలం అధికారంలో ఉన్న తర్వాత సహజంగానే యాంటీ ఇన్‌కంబెన్సీ ఏర్పడే అవకాశం ఉంటుంది. విపక్ష పార్టీలు దానినే ప్రధానంగా టార్గెట్ చేస్తాయి. వైసీపీ కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. తాము గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తుచేయడంతో పాటు.. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని హామీలు ఇవ్వవచ్చని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఇది వైసీపీకి సానుకూలతను పెంచే అవకాశం ఉండొచ్చు.కానీ ఇక్కడే వైసీపీకి మరో సవాల్ ఎదురుకానుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన అజెండాను కూడా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజధాని విషయంలో వైసీపీకి స్పష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటన్నది ప్రశ్నగా మారవచ్చు. వైసీపీ అమరావతిపై ఎలాంటి విమర్శలు చేసినా.. అప్పటికి అమరావతి మొదటి దశ పనులు ప్రజలకు కళ్లముందు కనిపించే స్థాయికి చేరితే ఆ వాదన ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది కీలకం.
ఇదే విధంగా పోలవరం ప్రాజెక్టులోనూ కూటమి ప్రభుత్వం మొదటి దశ పనులను పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తోంది. సాగునీటి ప్రాజెక్టులను వరుసగా చేపడుతూ.. పెట్టుబడులు తీసుకొస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వాటిలో కొన్ని పెట్టుబడులు, ప్రాజెక్టులు అప్పటికి గ్రౌండింగ్ దశకు చేరితే.. అభివృద్ధి అంశాన్ని కూడా కూటమి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో కేవలం ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకుని వైసీపీ చేసే ప్రచారం ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది ఆసక్తికరమైన చర్చగా మారుతోంది.ఇదే అంశాన్ని ముందుగానే గుర్తించిన టీడీపీ.. జగన్ పాదయాత్రకు పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే నారా లోకేష్ కూడా కౌంటర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది. జగన్ ఎక్కడ పర్యటిస్తే.. అక్కడే ఆయనకు కౌంటర్‌గా లోకేష్ కూడా పాదయాత్ర చేసేలా వ్యూహం రూపొందించవచ్చని అంటున్నారు. అంటే జగన్ తన పాదయాత్రలో కూటమి ప్రభుత్వంపై ఏ విమర్శ చేసినా.. అదే ప్రాంతంలో లోకేష్ ప్రజల ముందుకు వెళ్లి దానికి సమాధానం ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.ఇలా చేయడం ద్వారా జగన్ పాదయాత్రను కేవలం ఏకపక్ష ప్రచార వేదికగా మారకుండా అడ్డుకోవడంతో పాటు.. వైసీపీని ప్రతి ప్రాంతంలోనూ రాజకీయంగా కార్నర్ చేయాలని టీడీపీ భావిస్తోందనే చర్చ జరుగుతోంది.జగన్ ఒక గ్రామంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. అదే ప్రాంతంలో లోకేష్ పర్యటించి కూటమి ప్రభుత్వం చేసిన పనులను వివరించడం, సంక్షేమ పథకాల గురించి చెప్పడం, వైసీపీ పాలనలో జరిగిన అంశాలను ప్రస్తావించడం వంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జగన్, లోకేష్ పాదయాత్రలు దాదాపు ఒకే సమయంలో ఏపీలో ప్రారంభమయ్యే అవకాశం ఉందనే ప్రచారం మరింత ఆసక్తిని రేపుతోంది. సాధారణంగా పాదయాత్ర అంటే ప్రతిపక్ష పార్టీలు చేపట్టే కార్యక్రమంగానే ఇప్పటివరకు రాజకీయాల్లో కనిపించింది. అధికారంలో ఉన్న పార్టీ నేత కూడా పాదయాత్ర చేపట్టి.. ప్రతిపక్ష నేతకు నేరుగా కౌంటర్ ఇవ్వడం అరుదైన పరిణామంగా మారుతుంది. అందుకే జగన్ పాదయాత్ర ఒకవైపు.. దానికి కౌంటర్‌గా లోకేష్ పాదయాత్ర మరోవైపు సాగితే ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే జగన్ పాదయాత్రపై వైసీపీ అధికారికంగా పూర్తి వివరాలను ఎప్పుడు ప్రకటిస్తుంది? లోకేష్ నిజంగానే కౌంటర్ పాదయాత్ర చేపడతారా? ఇద్దరి పాదయాత్రలు ఒకే సమయంలో జరుగుతాయా? అనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాతే ఈ వ్యూహాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.







