Business Idea : ఐటీ జాబ్ వదిలేసి.. సీక్రెట్ మసాలా చాయ్ అమ్ముతూ నెలకు 60 వేలు సంపాదిస్తున్న ఇంజనీర్
Business Idea : చాలా మంది కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే వాటిని సాకారం చేసుకుంటారు. అనుకున్న దాని కోసం శ్రమిస్తారు. కష్టపడి సాధిస్తారు. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకే సాగుతూ విజయాన్ని అందుకుంటారు. మరికొంత మంది చేస్తున్న పని లేదా ఉద్యోగం నచ్చక… తమదైన వ్యాపారాన్ని మొదలు పెట్టాలని భావిస్తారు. కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే అనుకున్న దానిని సాకారం చేసుకుంటారు. అందులో ఒకరే మధ్యప్రదేశ్ లోని చింద్వారాకు చెందిన అంకిత్ నాగవంశీ. ఆయన ముంబయిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసేవాడు. ఏడాదికి రూ.8 లక్షల జీతం అందుకుంటున్నా.. పనిలో మాత్రం సంతృప్తి దొరికేది కాదు
. 9-5 ఉద్యోగం అతనికి విపరీతమైన బోర్ కొట్టించేది. ఏదైనా కొత్తగా చేయాలని, స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు.ఆహార రంగంలో తనదైన శైలిలో ఏదైన కొత్తగా ఉండే వ్యాపారాన్ని ప్రారంభించాలని కలలు కనే వాడు నాగవంశీ. 2019 నాటికి తనకు ఉద్యోగం వదిలి వేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. అదే ఏడాది ఆగస్టు 15న ఉద్యోగానికి రాజీనామా చేసేసి స్వగ్రామమైన మధ్యప్రదేశ్ లోని చింద్వారాకు తిరిగి వెళ్లాడు. ఇప్పుడు అతని జీవితం పూర్తిగా మారి పోయింది. సమయంతో పని లేకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నాడు. టీ వ్యాపారం చేస్తూ నెలకు రూ. 60 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. ఇద్దరు ఉద్యోగులను నియమించుకున్నాడు. ఈ మార్పు తనకు తానుగా రాలేదని..

ankit nagwanshi chhindwara Madhya Pradesh engineer chaiwala quit it job success story
పూర్తిగా తన ఇష్టప్రకారం చేసిందిగా చెబుతాడు నాగవంశీ. ఇది తనకు సంతృప్తిని ఇస్తోందని అంటాడు.అంకిత్ నిష్క్రమించిన తర్వాత సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించాలని అనుకున్నాడు. కానీ దానిని ప్రారంభించేందుకు తగిన స్తోమత కానీ లేదా అనుభవం కానీ తనకు లేదు. మొదట చిన్నగా ప్రారంభించి.. క్రమంగా ఎదగాలని భావించి టీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. భారత్ లాంటి దేశంలో, టీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరూ టీ తాగుతారు.అది కూడా రోజుకు చాలా సార్లు. ఇది లాభదాయకమైన అవకాశం అని మరియు తక్కువ పెట్టుబడి అవసరమని భావించాడు అంకిత్.
టీ వ్యాపారంలో విజయం సాధిస్తే, ఇతర ఆహార విభాగాలను విస్తరించి, చివరికి ప్రయోగాలు చేయగలనని అంకిత్ చెబుతున్నాడు.అంకిత్ మొదట టీ అమ్మడం ప్రారంభించాలనుకున్నప్పుడు మొదట తన కుటుంబం నుండే వ్యతిరేకత మొదలైంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి చాయ్ వాలాగా మారడాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోయారు. కానీ రెస్టారెంట్ స్థాపించడానికి ఇది తొలి మెట్టు అని వారిని అంకిత్ ఒప్పించగలిగాడు. టీ వ్యాపారం ప్రారంభించి తనదైన రుచులను అందిస్తున్నాడు అంకిత్. ఇంజినీర్ చాయ్ వాలా అని ఉన్న రెస్టారెంట్ బోర్డు కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఉపయోగపడుతోందని అంటాడు అంకిత్. త్వరలోనే తన లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమాగా చెబుతున్నాడు నాగవంశీ.