Business Idea : 22 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడింది.. ఇప్పుడు 50 కోట్ల బిజినెస్ ను రన్ చేస్తోంది.. ఎలా సాధ్యమైందో తెలుసా?
Business Idea : ఏదైనా సాధించడానికి సంకల్పం అత్యంత కీలకం. విజయంపై ఆశ, కోరిక ఉంటే సరిపోదు.. దానిని సాధించేందుకు అంతే కృషి, శ్రమ కూడా ఉండాలి. పట్టు వదలకుండా కష్టపడితేనే విజయం దాసోహం అంటుంది. గెలుపు మన ముంగిట వాలుతుంది. సంకల్ప బలం ఎంత గొప్పదైతే.. జనాలు మన గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటారు. అలాంటి వారినే ఆదర్శంగా భావిస్తారు.ఒక సాధారణ మార్వాడీ కుటుంబం నుండి వచ్చిన కనికా టేక్రివాల్ క్యాన్సర్ ను జయించి తాను అనుకున్న కలలుకన్న వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 500 మిలియన్ రూపాయల విలువైన సంస్థలు విజయవంతంగా ముందుకు నడిపిస్తోంది.కనికా టేక్రివాల్ లండన్ లో ఎంబీఏ పూర్తి చేసింది. తాను అక్కడ చదువుకుంటున్న సమయంలోనే వ్యాపారం మొదలు పెట్టాలని కలలు కనేది.
కనికా ఆలోచనలు ఎప్పుడూ దాని పైనే ఉండేవి. సంస్థను నెలకొల్పాలని, దానిలో విజయం సాధించి ఆదర్శంగా నిలవాలని తాపత్రయపడేది. ఎన్నో ఆశలో లండన్ నుండి ఇండియాకు వచ్చింది. తన అంకుర సంస్థను ప్రారంభించాలనుకున్న సమయంలోనే తనకు ఓ పిడుగు లాంటి వార్త తెలిసింది. అదేంటి అంటే తనకు హాడ్జ్ కిన్స్ లింఫోమా అనే క్యాన్సర్ ఉందని వైద్యులు ధ్రువీకరించారు. 22 ఏళ్ల కనికా టేక్రివాల్ కు తన జీవితంలో అదో అతిపెద్ద కష్టమనే చెప్పాలి. చిన్నప్పటి నుండి ఏ కష్టం రాకుండా పెరిగిన తను.. ఈ అనుకోని ఉపద్రవంతో కొంత కుదుపుకు గురి అయింది.కనికా టేక్రివాల్ క్యాన్సర్ నుండి కోలుకుంటుందని వైద్యులు కూడా అనుకోలేదు. కానీ కనికా సంకల్ప బలం ముందు క్యాన్సర్ కూడా ఓడిపోయి తనకు దాసోహమంది. క్యాన్సర్ నుండి అయితే కోలుకున్నది కానీ.. తన బిజినెస్ ను ప్రారంభించేందుకు ఢిల్లీ వెళ్తానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
భయంకరమైన క్యాన్సర్ ను జయించిన తర్వాత వారు తనను వదిలి ఉండాలనుకోలేదు. అందుకే ఢిల్లీ వెళ్లేందుకు ససేమిరా అన్నారు. వారి వద్దే ఉంటూ తన బిజినెస్ కు కావాల్సిన సమాచారాన్ని, జ్ఞానాన్ని అంతా సంపాదించింది కనికా.జెట్స్ గో ఏవియేషన్ సర్వీసెస్ పేరుతో స్టార్టప్ ను మొదలుపెట్టింది. దేశంలో ఇలాంటి సర్వీసెస్ అందిస్తున్న ఒకే ఒక సంస్థ కనికా టేక్రివాల్ ది కావడం విశేషం. ఇప్పుడు కనికా 500 మిలియన్ రూపాయల విలువైన ప్రైవేట్ జెట్, హెలికాప్టర్ నిర్వహణ మరియు చార్టర్డ్ సేవల వ్యాపారానికి యజమాని. దీనిని ‘ఉబర్ ఆఫ్ ది స్కైస్’ అని పిలవబడుతోంది. కనికా కంపెనీ భారతదేశంలో దాదాపు 150 మంది వాణిజ్య విమాన ఆపరేటర్లతో కలిసి పని చేస్తోంది. 2016లో ఆసియాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా ఫోర్బ్స్ 30 అండర్ 30లో వ్యవస్థాపకురాలిగా పేరు పొందింది.