Gold Rate Today On Jan 20th : దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే !!
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ మధ్య అయితే చెప్పాల్సిన పనిలేకుండా , సామాన్యులకు భారంగా బంగారం ధర లక్షన్నరకు చేరువ అయ్యింది. ఇలా పెరుగుతున్న ధరలు చూసి గుండెలు బాదుకుంటున్నారు. కేవలం బంగారం ధరలే కాదు వెండి కూడా పరుగులు పెడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి ధరలు కూడా లక్షల్లో చేరింది.
Gold Rate Today On Jan 20th : దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే !!
ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. ఒకప్పుడు తులం బంగారం అంటే పది వేల లోపు ఉండే రోజులను చూశాం, కానీ ఇప్పుడు ఆ ధర ఏకంగా లక్షన్నర రూపాయల మార్కుకు చేరువ కావడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.తాజాగా గ్రీన్‌లాండ్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలపై విధించిన 10 శాతం సుంకం (Tariff) ప్రపంచ మార్కెట్‌ను అతలాకుతలం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడంతో, కేవలం ఒక్కరోజులోనే పసిడి ధర భారీగా పెరిగింది.
నేడు మంగళవారం (జనవరి 20) నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,250 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,060 కు చేరుకుంది. చెన్నై వంటి నగరాల్లో ఈ ధరలు మరికొంత ఎక్కువగా ఉండి రూ.1,46,740 మార్కును తాకాయి. నిన్నటితో పోలిస్తే రూ.2 వేల మేర పెరుగుదల కనిపించడం మార్కెట్ తీవ్రతకు నిదర్శనం. ఇలాగే ధరలు పెరిగితే త్వరలోనే తులం బంగారం లక్షన్నర దాటడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో వేలల్లో ఉండే వెండి ధర ఇప్పుడు ఏకంగా లక్షల్లోకి చేరింది. హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3.18 లక్షలకు చేరుకోవడం విశేషం. సోమవారం ఒక్క రోజే వెండి ధర ఏకంగా రూ.8 వేలు ఎగబాకడం గమనార్హం. ముంబైలో కిలో వెండి రూ.3,05,100 వద్ద కాస్త తక్కువగా ట్రేడ్ అవుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా వెండి ధరలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరల పెరుగుదల సామాన్య కుటుంబాలపై పెను భారాన్ని మోపుతోంది.