Business idea : సంప్రదాయ వంటపాత్రలు అమ్ముతూ నెలకు లక్షలు సంపాదిస్తున్న కేరళ మహిళ.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Business idea : కేరళకు చెందిన ఓ మహిళ ప్రారంభించిన వంటపాత్రల బిజినెస్ ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. కేవలం సాధారణ వంట పాత్రలనే అమ్ముతూ… మూడింతల రిటర్న్స్ సాధిస్తోంది. ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు వాడే పాత సాంప్రదాయ వంట పాత్రలనే ఆమె అమ్ముతోంది.కేరళలోని కొచ్చిన్ కు చెందిన కావ్య చెరియన్.. ఒక రోజు తనకిష్టమైన వంటకాన్ని వండింది. అలా చాలా సార్లు జరిగినా ఎప్పుడూ వాళ్ల అమ్మమ్మ వండితే వచ్చే రుచి మాత్రం రాలేదు. వండే తీరును మార్చి చూసినప్పటికీ తనకిష్టమైన రుచిని మాత్రం తీసుకురాలేకపోయింది. చివరికి కావ్య గుర్తించింది ఏమిటంటే.. వంట పాత్ర మారిస్తే రుచి కూడా మారుతుంది, మరింత మధురంగా ఉంటుందని గమనించి వాళ్ల అమ్మమ్మ వాడే ఈయ చొంబులో రసం చేసి చూసింది.
అప్పుడు తనకిష్టమైన రుచి వచ్చింది.నగరాల్లోని పెద్ద పెద్ద దుకాణాలు, మార్కెట్లలో నాన్ స్టిక్ కుక్ వేర్‌లు దొరుకుతున్నాయి కానీ.. పాత సాంప్రదాయమైన పాత్రలు మాత్రం ఎక్కడా దొరకలేదు. ఇదే ఆగస్టు 2020లో గ్రీన్ హెయిర్ లూమ్ ను స్థాపించడానికి దారితీసిందని కావ్య చెబుతోంది. నాన్-స్టిక్ వంట సామాను యొక్క జీవితకాలం సుమారు ఆరు సంవత్సరాలు మాత్రమే అని దాని తర్వాత అవి వాడకానికి ఏమాత్రం పనికి రావని.. వాటిలో వండితో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతోంది కావ్య. అదే పాత సాంప్రదాయ వంట సామాను దశాబ్దాల తరబడి వాడకానికి ఉపయోగించవచ్చని అంటోంది.
ఈ పాత్రలను కొనడం దీర్ఘకాలిక పెట్టుబడి వంటిదేనని చెబుతోంది. వాళ్ల అమ్మమ్మ వంట గదిలోని కొన్ని పాత్రలు ఆమె కంటే చాలా పాతవని వివరిస్తోంది. సాంప్రదాయ వంట సామాను వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచి కూడా అమోఘంగా ఉంటుందని చెబుతోంది. నాన్ స్టిక్ కుక్ వేర్‌లో వండిన చేపల కూరకు… మట్టి పాత్రలో వండిన చేపల కూరకు రుచిలో ఎంతో తేడా ఉంటుందని వివరిస్తోంది కావ్య చెరియన్. కేవలం రూ. 3.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన బిజినెస్ ను క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లోని సాంప్రదాయ వంట పాత్రలను తన వెబ్ సైట్ ద్వారా మరింత మందికి అందిస్తోంది.