ఆంజనేయ స్వామికి ప్రీతికలిగించేవి ఏమిటో మీకు తెలుసా !
ఆంజనేయస్వామి… సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు అన్ని శుభాలే. అంతేకాదు కలికాలంలో శ్రీఘ్రంగా మనకు వరాలను ఇచ్చే స్వామి కూడా ఆయనే. అయితే ఆయనకు ఇష్టమైన పదార్థాలు, పండ్లు, ఇతరముల గురించి తెలుసుకుందాం..
మంగళకరుడగు ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ పరమ ప్రీతికరము. అదేవిధంగా పారిజాతములు, మందార పుష్పములు, నందివర్ధనము, మల్లెలు, గన్నేరు మున్నగు పుష్పములు స్వామికి ఇష్టమని ఆయా పురాణాలలో ఉంది. ఇక వీటితోపాటు తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములు ప్రీతికరములు. అరటి, మామిడి, నిమ్మ, కొబ్బరి, పనస, నేరేడు మున్నగు ఫలములు స్వామి వారికి మిక్కిలి ఇష్టము.
ప్రీతికరమైన పదార్థాలు
ఆంజనేయస్వామి వారికి సింధూరము, సింధూరాక్షతలు, పసుపు లక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, కర్జూరము మొదలగు పూజాద్రవ్యములు, పాయసం, పొంగలి, అప్పములు, వడలు, వడపప్పు, పానకము, పాలు మొదలగు పదార్థాలు నైవేద్యంగా నివేదన చేయాలి. వీటి వల్ల స్వామి సంతుష్టుడగును. ఆవు నేయ్యితో చేసిన దీపారాధన చాలా శ్రేష్టము. ఆంజనేయస్వామి అరటి తోటలంటే మిక్కిలి ఇష్టము. కావున స్వామిని కదళీవనములందు పూజించిన మంచి ఫలితాలు వస్తాయి. స్వామి వారిని మంగళవారం, శనివారం ఎక్కువ సేవించినా అంటే ఆరాధించిన మంచి ఫలితాలు వస్తాయి.