Brahmam Garu : ‘‘బ్రహ్మం గారి మఠం’’ గొడవను.. మరింత పెద్దది చేస్తున్నదెవరు?..
Brahmam Garu : కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను కొన్ని వందల సంవత్సరాల ముందే ఊహించి చెప్పారని అంటారు. కానీ తన మఠ వారసుల ఎంపిక విషయాన్ని కూడా ఈ స్థాయిలో రాజకీయం చేస్తారని, ఇది ఇంత రచ్చ రచ్చ అవుతుందని ఆయన అనుకొని ఉండరు. బ్రహ్మం గారికి ఫలానా ప్రాంతంలో ఒక మఠం ఉందనే సంగతి ఈ గొడవ వల్లే చాలా మందికి తెలుస్తోందంటే అంతకు మించిన అపఖ్యాతి మరొకటి ఏముంటుంది?. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని ఇప్పట్లో చల్లార్చే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు లేదేమోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ప్రాబ్లం ఏంటి?..
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ‘బ్రహ్మం గారి మఠం’ అనే మండలంలో పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామి మఠం ఉంది. బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతి(ఏడో తరాని)కి చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ఈ మఠానికి 11వ అధిపతి. మే నెల 8వ తేదీన కాలం చేశారు. ఆయనకు ఇద్దరు భార్యలు. తన వారసత్వాన్ని చిన్న భార్య కుమారుడికి ఇవ్వాలంటూ ఆయన వీలునామా రాసినట్లు చెబుతున్నారు. దానికి పెద్ద భార్య, ఆమె కొడుకు ఒప్పుకోకపోవటంతో పంచాయతీ మొదలైంది. సంప్రదాయం ప్రకారం ఆ పదవి తమకే చెందుతుందని వాళ్లు వాదిస్తున్నారు. ఈ వ్యవహారం నెల రోజులుగా నడుస్తోంది.

brahmam gari matam issue
ప్రభుత్వం ఏం చేయాలి?..: Brahmam Garu
మఠానికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం సర్కారు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తే సరిపోయేది. కానీ ప్రభుత్వ ధోరణి ఇరు వర్గాల మధ్య మరిన్ని పుల్లలు పెట్టేలా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదని, సత్వరం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కానీ గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవటం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీలు వేయటం.. వివిధ మఠాల అధిపతులను మధ్యవర్తులుగా పంపటం.. లేటెస్టుగా కడప అసిస్టెంట్ కమిషనర్ ని నియమించటం.. ధార్మిక పరిషత్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పటం.. వంటివన్నీ కాలయాపనకేనని అంటున్నారు.
పవిత్రతను కాపాడండి
ఇవన్నీ కాకుండా మఠం నియమ నిబంధనల మేరకు ముందుకు వెళ్లటమే కరెక్ట్ అని, తద్వారా మఠం పవిత్రను కాపాడాలని భక్తులు వేడుకుంటున్నారు. 128 మఠాల సభ్యులతో కమిటీ వేస్తామని, 30 రోజుల ముందు నోటీసులిచ్చి అందరితో చర్చిస్తామని దేవాదాయ వాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తుంటే ఈ తతంగం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదనిపిస్తోంది. ఇప్పటికే 12 మంది శైవ క్షేత్రాల పీఠాధిపతులు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవటం గమనార్హం.