Arundhati Nakshatram : పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా…?
Arundhati Nakshatram : అరుంధతి నక్షత్రానికి మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. వివాహ వేడుకలో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వధూవరులకు పురోహితుడు కచ్చితంగా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అసలు అరుంధతి నక్షత్రం ఏమిటి? ఎందుకు పెళ్ళిలోనే చూపిస్తారని విషయాలపై చాలామందికి ఎన్నోసార్లు సందేహాలు వచ్చే ఉంటాయి. అరుంధతి వశిష్ట మహర్షి భార్య. బ్రహ్మ కుమార్తె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశం చేసేందుకు బ్రహ్మచారి కోసం వెతుకుతున్న సమయంలో వశిష్ట మహాముని కనిపిస్తాడు. ఆమె అతడే తనకు ఉపదేశం చేసేందుకు తగిన వాడని భావించి అతడిని ఆశ్రయించింది.
బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు సంధ్యాదేవికి ఉపదేశం చేయడానికి అంగీకరించాడు. అనంతరం సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ అగ్ని నుంచి ప్రాతః సంధ్య సాయం సంధ్యల తో పాటు ఒక స్త్రీ రూపం వెలువడ్డాయి. అందమైన స్త్రీ రూపమే అరుంధతి. ఆ అపురూప సౌందర్య రాశి అయిన అరుంధతి పై వశిష్ఠుడు మనసు పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయంలో వశిష్టుడు తన కమాండలాన్ని అరుంధతికిచ్చి తాను తిరిగే వచ్చేంతవరకు చూస్తూ ఉండమని చెప్పి వెళ్తాడు. అలా ఏళ్ళు గడిచిపోయాయి. అయినా వశిష్ఠుడు రాకపోవడంతో అరుంధతి ఆ కమండలాన్ని చూస్తూ ఉండిపోయింది.
అలా చూస్తూ ఉండిపోయిన అరుంధతిని ఎందరో పండితులు ఆమెను చూపు మరచాలని చెప్పినప్పటికీ ఆమె మాత్రం కమండలంపై నుంచి చూపు తిప్పలేదు. ఇక చేసేది లేక వశిష్టుడిని వెతికి తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టారు. ఆయన రాకతో తన చూపును కమండలం నుంచి వశిష్టుడి వైపు మరలిచింది. అప్పటినుంచి అరుంధతి మహాపతివ్రతగా నిలిచిపోయింది. అరుంధతి తన అకుంఠిత దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే మూడు ముళ్ళు వేసిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. అరుంధతిలా సద్గుణాలు కలిగి ఉండాలని ఆ బంధం అరుంధతి వశిష్టుల చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ అ నక్షత్రాన్ని చూస్తారు.