Maha Shivaratri : మహాశివరాత్రి మార్చి 11న ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వున్న శైవక్షేత్రాలను గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.. శివుడినామాన్ని స్మరించినా, జపించినా, తలుచుకున్నా పుణ్యం అని పెద్దలు చెప్తారు. ఇక ఆయా క్షేత్రాల గురించి వాటి విశేషాలను మనసులో మననం చేసుకుంటే, అవకాశం ఉంటే చూసివస్తే ఆఫలితం ఎన్నో వేలరెట్లు ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయా క్షేత్రాల గురించి తెలుసుకుందాం.. తెలంగాణా రాష్ట్రం పలు శివక్షేత్రాలకు నెలవు. శివరాత్రి సందర్భంగా మనకు అందుబాటులో ఉన్న శైవ క్షేత్రాల దర్శనం పుణ్యప్రదం. ‘పుణ్యగుణ భూమ యీ తెలంగాణ సీమ’ అని ఒక కవీశ్వరుడన్నట్లు తెలంగాణా నేలపై అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. అనేక రాజవంశాల పాలన కొనసాగిన తెలంగాణ భూభాగంపై పలు దేవాలయాల నిర్మాణం కొనసాగి దైవ సన్నిధానాల సంఖ్య పెరిగింది.
పదిజిల్లాల్లోనూ అనేక శివాలయాలు మనం దర్శించుకోవచ్చు. పాత పది జిల్లాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది వరంగల్లు జిల్లా. ఒకనాటి తెలుగునేలను సర్వం సహాధిపత్యంతో పాలించిన పాలకులైన కాకతీయులకు రాజధాని నాటి ఓరుగల్లే నేటి వరంగల్లు.
త్రిలింగ దేశంగా పేరెన్నికగన్న తెలుగునేలపై ఉన్న మూడు ప్రధాన శివక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరం తెలంగాణా భూమిలో ఒక భాగం. ఆరు మతాల్లో ఒకటిగా లోకంలో వ్యాప్తిచెందిన శైవానికి కాకతీయ రాజ్యం ఆటపట్టైంది. కాకతీయులు శైవమతాన్ని విశేషంగా ఆదరించారు కనుకనే పలు శివాలయాలు ఈ నేలలో చోటు చేసుకున్నాయి. కాకతీయుల గురువుగా ప్రసిద్ధుడైన ‘విశ్వేశ్వర శంభువు’తోపాటు మరికొందరు మాన్యులు కాకతీయ రాజ్యంలో శైవమతానికి పెద్ద పీటవేశారు.
కాకతీయుల కాలంనాడు దాదాపు ఐదువేలకుపైగా శివాలయాలున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తున్న వేయిస్తంభాలగుడి, రామప్ప దేవాలయం, స్వయం భూదేవాలయాలతో బాటు, కొడవటూరులోని సిద్ధేశ్వరాలయం, కొమరవెల్లిలోని మల్లికార్జునస్వామి ఆలయం, అయినవోలులోని మల్లికార్జునాలయం, పాలకుర్తిలోని సోమేశ్వరస్వామి ఆలయం, హనుమకొండలోని సిద్ధేశ్వరాలయంవంటి పలు ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. రామప్ప దేవాలయం వరంగల్లు జిల్లా పాలంపేటలో ఉన్నది. కాకతీయ గణపతి దేవచక్రవర్తి దగ్గర సేనానిగా ఉన్న రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని 1213 ప్రాంతంలో శ్రీముఖనామ సంవత్సరం చైత్ర శుద్ధ అష్టమి, ఆదివారంనాడు పుష్యమీ నక్షత్రం ఉన్న సమయంలో ఇక్కడ లింగ ప్రతిష్ఠ జరిగినట్లు తెలుస్తున్నది. అపురూప శిల్పకళావైభవంతో నేటికీ ఒక ప్రత్యేక దర్శనీయ స్థలమై వెలుగొందుతున్న రామప్ప దేవాలయం వరంగల్లుకేకాదు యావత్తు తెలంగాణాకు తలమానికమైన ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడి రామప్ప చెరువు, ‘నాగిని’ శిల్పులు నాటివారి దూరదృష్టికి గొప్ప నిదర్శనాలు.
కాకతీయుల కాలంనాటి మరో ప్రసిద్ధ దేవాలయం వేయిస్తంభాల గుడి`దీన్నే రుద్రేశ్వరస్వామి ఆలయంగా వ్యవహరిస్తారు. ఇది త్రికూటాలయం. వేయిస్తంభాల మంటపంతో కూడిన ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుని రూపం అపురూపం. ఎత్తైన పానవట్టంపై ఎత్తైన లింగాకారంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటాడు. మహాశివరాత్రి పర్వదినం పరమవైభవంగా సాగే యీ ఆలయంలో ‘నంది’ కాకతీయు లకు ఒక ప్రత్యేకతను సంతరించిపెట్టింది. ఇంకా కోటలో కాకతీయుల కళాతోరణాల దగ్గర కొలువై ఉన్న ఈ స్వయంభూ దేవుడు, సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన సిద్ధేశ్వరస్వామి వంటి పలు శివాలయాలు మనకు వరంగల్లులో దర్శనమిస్తాయి. జిల్లా వ్యాప్తంగా అనేక శివాలయాలు నేటికీ శివభక్తుల నిలయాలై విరాజిల్లుతున్నాయి.
కరీంనగర్ జిల్లాలో ‘వేములవాడ రాజరాజేశ్వరస్వామి’ ఆలయం సుప్రసిద్ధం. అదేవిధంగా కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామి ఆలయం కూడా మిక్కిలి పేరుగాంచిన క్షేత్రం… ఇవిగాక ఓదెలలో మల్లికార్జునస్వామివంటి మరికొన్ని శైవక్షేత్రాలు యీ జిల్లాలో ఉన్నాయి. మనం ఇంతకుపూర్వం చెప్పుకున్నట్టుగా త్రిలింగాలలో ఒకటైన కాళేశ్వరం పవిత్ర గోదావరితీరంలో వెలసిన దివ్యశైవక్షేత్రం విశాలమైన ప్రాంగణం కలిగి ఉన్న ఈ దేవాలయంలో కాళేశ్వరస్వామి, ముక్తేశ్వరస్వామి ఇరువురు ఒకే పానవట్టంపై వెలసి భక్తులకు అభయ ప్రదానం చేస్తుండటం విశేషం. ఈ ప్రాంగణంలోకి ఇతర పరివార దేవతల ఆలయాలు కూడా విశేషంగా ఆకర్షిస్తాయి. మహాశివరాత్రి పర్వదినంనాడు భక్తులు అశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానంచేసి స్వామిని సేవించి పునీతులవుతుంటారు.
కరీంనగర్జిల్లాలోని మరో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడలో వెలసిన ‘శ్రీ రాజరాజేశ్వరస్వామి’ ఆలయం. అనేకమైన ప్రాంతాలనుండి దూరాలను లెక్కజేయకుండా భక్తులు స్వామిని సేవించి ఆయన కృపకు పాత్రులై తరిస్తుంటారు. కోడె మొక్కులు, తలనీలాల సమర్పణవంటి ప్రత్యేకతలున్న ఈ ఆలయ పరిసరాల్లో భీమేశ్వరస్వామి ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం వంటి పలు దేవాలయాలు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. మహాశివరాత్రి పరమ వైభవోపేతంగా ఇక్కడ నిర్వహింపబడుతుంది. మహబూబ్నగర్ జిల్లాలోని అలంపురంలోని ‘బాల బ్రహ్మేశ్వరాలయం’ పుణ్యప్రదమైన శైవక్షేత్రం. అద్భుత శిల్ప నిర్మాణ సమన్వితమైన తొమ్మిది ఆలయాలు ‘నవబ్రహ్మ’ ఆలయాలుగా ప్రసిద్ధిచెందాయి. అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠంగా ఇవి ప్రముఖమై నిలిచింది. ‘జోగుళాంబ’గా వెలసిన ఈ శక్తి కొలువై ఉన్న ఈక్షేత్రం పరమపావని ‘తుంగభద్ర’ తీరక్షేత్రం. సృష్టికర్త అయిన ‘బ్రహ్మ’ పరమేశ్వరునికై తపమాచరించిన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. చాళుక్య రాజుల ఆలయ నిర్మాణ పద్ధతులను ఇక్కడి దేవాలయ నిర్మాణాల ద్వారా తెలుసుకోవచ్చు. మహా శివరాత్రికి ఇక్కడికివచ్చి భక్తులు స్వామిని అభిషేకించి పూజించి పునీతులౌతుంటారు. ఈ జిల్లాలోని మరో సుప్రసిద్ధశైవక్షేత్రమైన ‘‘శ్రీ ఉమా మహేశ్వరక్షేత్రం’’ శ్రీశైలానికి ఉత్తర ద్వారమైతే, అలంపురం పశ్చిమద్వారంగా ప్రసిద్ధి చెందింది.
నల్లగొండ జిల్లాలోని ‘‘ఛాయసోమేశ్వరాలయం’, చెరువుగట్టులోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర ఆలయం, వాడపల్లి అగస్తేశ్వర ఆలయం, ‘నిజామాబాదులోని ‘నీల కంఠేశ్వరాలయం’, మహబూబ్నగర్ జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతంలోఉన్న ‘‘సలేశ్వరం’’, రంగారెడ్డి జిల్లాలోని ‘కీసరగుట్ట’ ఆలయంవంటి ఎన్నెన్నో శివాలయాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల రాకతో జనసంద్రంగా మారుతుంటాయి. ఈ క్షేత్రాలలో అనేక విశేషాలు ఉన్నాయి. ఎంతో చారిత్రక, సాంస్కృతిక వైభవంతో అలరారిన దేవాలయాలు ఇవి. అవకాశం ఉన్నవారు ఆయా క్షేత్రాలను సందర్శించి స్వామిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.