మూఢములో శుభ కార్యక్రమాలు ఎందుకు చేయరు?
Mudalu : మూఢం.. హిందూ ధర్మంలో ప్రతి చిన్న శుభకార్యం చేయాలన్న మంచిరోజులు చూస్తారు. దీనిలో ప్రధానంగా మూఢాలు లేని సమయాన్ని మంచిరోజుగా భావిస్తారు. అసలు మూఢం అంటే ఏమిటి ? ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రవితో ఏ గ్రహం కలసి ఉంటుందో ఆ కలసి ఉండే కాలానికి ఆ గ్రహం యొక్క మూఢము లేదా మౌఢ్యము అని అంటారు. సూర్యుడు ఉన్న పగటి వేళలో ఏవిధము గా మనం వాడే లైట్లు లేదా కాంతిసంబంధిత వస్తువులు ఎలాగనైతే సంపూర్ణ వెలుగు ఇవ్వలేవో.. అదే విధముగా రవితో నిర్దేశిత కాల వ్యవధిలో కూడి ఉన్న గ్రహాలు ఆయా కాలములలో తమ సంపూర్ణ ఫలితములు ఇవ్వలేవు.
సూర్యుడు 12 రాసులలో ఒక్కో రాశిలో సుమారు ఒక్కో నెల ఉంటాడు. సూర్యుడు ఉన్న రాశిలోకి సంబంధిత గ్రహము ప్రవేశించినా, సంబంధిత గ్రహము ఉన్న రాశిలోకి సూర్యుడు ప్రవేశించినా, అలా ఉన్న కాలాన్ని ఆ గ్రహమునకు సంబంధించిన మూఢము లేదా మౌఢ్యమిగా పేర్కొంటారు.
Mudalu : శుక్రుడు, గురువు గ్రహములకు అధిక ప్రాధాన్యత
ఈ విధముగా ప్రతి గ్రహమునకు సంబంధించిన మూఢము ఉన్నప్పటికీ, మనపై ఎక్కువగా ప్రభావము చూపించే లేదా ఉపయోగపడే శుక్రుడు, గురువు గ్రహములకు సంబంధించిన మూఢములకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. భోగభాగ్యాలు, వాహనాలు, వివాహాది శుభ కార్యక్రమ ఫలితాలు శుక్రుడు ఇస్తాడు, అలాగే సంతానము, సౌభ్రాతృత్వము, విద్య, వివేకము, విజ్ఞానము మొదలగు ఫలితాలు గురువు ఇస్తాడు. అటువంటి శుక్రుడు, రవితో కలసి ఉన్న సమయాన్ని శుక్ర మూఢము అంటాం.
ఈ సమయములో శుక్రుడు తన సంపూర్ణ ఫలితాలు అందజేసే స్థితిలో ఉండడు. కాబట్టి ఈ సమయాలలో వివాహాది శుభ కార్యక్రమాలు చెయ్యరు. శుభకార్యాలు చేయకూడదని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. ఇక ఈ సమయంలో పెళ్ళికి నాందిగా చెప్పుకునేవి పెళ్లి చూపులే కాబట్టి మూఢములో పెళ్లి చూపులు ఏర్పాటు చేయరాదు. మూఢము పూర్వము పెళ్లి చూపులు అయి అంగీకారము కుదిరితే.. పెళ్లి విషయములు ఇరువైపుల పెద్దలు మూఢములో మాట్లాడుకోవచ్చు. ఇదికొన్ని ప్రాంతాలలో ఉంది. అలాగే గృహారంభాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు కూడా చేయకూడదు.