Karthika Deepam : కార్తీక దీపాలను నీటిలో వదలటానికి గల కారణం ఇదా…!
Karthika Deepam : అన్ని మాసాలలో కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో మహిళలందరూ భక్తిశ్రద్ధలతో తెల్లవారుజామున దేవాలయాలకు వెళ్లి దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాలను నీటిలో వదిలేస్తారు. అయితే కార్తీక మాస పురాణాల ప్రకారం కార్తీకమాసంలో పిప్పలుడు అనే మహారాజు దీప దానం చేయడం వలన సంతానాన్ని పొందాడు. అలాగే వారి కుమారుడైన శత్రు జిత్తు ఈ నెలలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడని కథలు ఉన్నాయి. ఈ నెల రోజులు ఇంట్లో దీపాలు కన్నా చెరువులో నదులలో దీపాలను వదులుతుంటారు. ఏ నది తీరాన చూసిన కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడుతుంటుంది. సూర్యోదయం అయ్యే సమయానికి నది తీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది.
ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి పంచభూతాలు సకల ప్రాణకోటికి జీవనాధారాలు. శివ పంచాక్షరి మంత్రం అయినా నమశ్శివాయ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అనే అర్థాలు ఉన్నాయి. జగత్ అంత శివమయమే అయినప్పుడు అంతా శివోహమే. పంచభూతాలను కూడా తనలో లయం చేసుకొని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు. ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి దేవుడిని చేరుతుందంటారు. జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమశివుడిని అంకితం చేయడం. ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసాలలో ఒకటి కార్తీక మాసం.
కార్తీకమాసంలో దీపాలను వెలిగించి నదులు చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు, ఈ జన్మలో చేసిన పాపాలు నశించి శివుడి సన్నిధికి చేరుతామంటారు. అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలను నీటిలో విడిచి పెడతారు. కార్తీకమాసంలో చేసే ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో విష్ణువును తులసి దళాలు, కమలం, జాజి, గరిక తో ఆరాధించాలి. అలాగే శివుడికి బిల్వదళాలు, జిల్లేడు పూలతో పూజ చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కాకముందే స్నానం చేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా చేయలేని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో చేస్తే పుణ్యం లభిస్తుంది.