Tulsi Plant : ఇంటి ముందు తులసి చెట్టును ఎందుకు పెట్టుకోవాలి?
Tulsi Plant : మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే దేవతలు, రాక్షసులు క్షీర సాగర మథనాన్ని చిలికినప్పుడు తులసీ, జమ్మి, పారిజాత, రావి, వేప వృక్షాలు పుట్టినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. కల్ప వృక్షం పారిజాతం దేవలోకానికి సంక్రమించాయి. తులసి, రావి, వేప, జమ్మి వృక్షాలు భూలోక సంప్రాప్తం అయ్యాయని పౌరణికులు చెబుతారు. హిందువులకు ఈ నాలుగు వృక్షాలపై మమత్వం ఎక్కువ. తులసి చెట్టు రావి, వేప, జమ్మి వంటి పెద్ద వృక్షం కాదు. ఈ మొక్క నాలుగు అడుగులకు మించి పెరగదు. ఇండ్ల వద్ద వేప చెట్టును మాత్రమే పెంచుతారు. వేప కర్రను గృహోపకరణాలకు కూడా వాడుకోవచ్చు.
వేప విత్తనాలను రైతులు క్రిమి సంహారకంగా కూడా వాడుతుంటారు. రావి చెట్టును కావాలని ఎవరూ ఇండ్ల వద్ద ఉంచరు. ఎందుకంటే మర్రి చెట్టు లాగానే రావి చెట్టు కూడా దైత్య వృక్షం. మహా వృక్షంగా పెరిగి ఇంటిగోడలను పడవేస్తుంది. పూలు, పండ్లను ఇవ్వదు. రావి, కలపను దేనికీ ఉపయోగించరు. ఉపయోగం కూడా కాదు. జమ్మి చెట్టు తనకు తానుగా పుట్టి పెరగాలి అనే నమ్మకం ఉండటం వల్ల ఎవరూ పెంచరు.తులసి కోటను బ్రాహ్మణ వైద్య క్షత్రియులు మాత్రమే ఇంటి ముందు పెట్టి ప్రతినిత్యం నీరు పోసి నమస్కరిస్తుంటారు. జంధ్యపు కులాలకు మాత్రమే ఎందుకు తులసి పరిమితం అయిందో తెలియదు. తులసి వృక్షం ఆయుర్వేద రంగంలో మహత్తర స్థానం సంపాదించుకుంది.
ఎన్నో అనారోగ్యాలకు తులసి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. తులసిని లక్ష్మీ సమానంగా హిందువులు పూజిస్తారు. తులసి వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి దరిద్రం రాదని నమ్ముతారు. ప్రతినిత్యం తులసిని పూజించే స్త్రీలకు సౌభాగ్యం పది కాలాల పాటు ుచల్లగా ఉంటుందని పతి ప్రేమకు పాత్రులు అవుతారని, తులసీ ప్రదక్షణం చేసే వారికి ఆయుష్షు ఆరోగ్యం లభిస్తాయని భారతీయ స్త్రీ పవిత్ర విశ్వాసం. పసి పాపలు జలుబు, దగ్గు, దురదలను తులసి మొక్క దరి చేరనివ్వదు. విష్ణుమూర్తికి తులసి మాల అంటే ఎంతో ఇష్టమని వైష్ణవులు విశ్వసిస్తారు. ఎండిన తులసి కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పూసలుగా తయారు చేసి మెడలో ధరిస్తారు.