Mohan Babu : చిరంజీవి వద్దన్న పెద్దరికంను మోహన్ బాబు ఇలా పొందాలనుకుంటున్నాడా?
Mohan Babu : ఒక ఇంటికి పెద్ద ఉంటే గొడవలు జరిగిన ప్రతి సారి ఆయన వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులు వాటిని పరిష్కరించుకోవడం.. ఏదైనా సమస్య వస్తే ఆయన వద్దకు వెళ్లి సలహాలు తీసుకోవడం చేస్తారు… అలాగే ఏదైనా కుల సంఘం లేదా వర్తక సంఘంలో పెద్ద అనే వాడు ఒకడు ఉంటే వారిలో వారికి గొడవలు జరిగినా.. బయటి వారితో గొడవలు జరిగినా కూడా ఆ సమయంలో పెద్ద ఉండి ముందు నడిచి ఆ సమస్య ను పరిష్కరించడం చేస్తాడు. అలా కాదని గొడవ సమయంలో ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ గొడవ మరింత పెద్దది అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు టాలీవుడ్ కు సంబంధించి టికెట్ల రేట్ల పరిస్థితి అలాగే మారింది అంటూ కొందరు అంటున్నారు.ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు. ఆయన ఉన్నంత కాలం ఇండస్ట్రీలో ఏ విభాగంలో ఇబ్బంది తలెత్తినా కూడా ఆయన ముందు ఉండి సమస్యను పరిష్కరించేవాడు. ఆయన ప్రభుత్వం తో కూడా ఇండస్ట్రీ తరపున మాట్లాడేవాడు.
ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి.. రాజకీయం చేసిన వ్యక్తి కనుక ఆయన అనుభవం ఇండస్ట్రీకి చాలానే ఉపయోగపడింది అంటారు. ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి ఆయన సినిమాలు లేని లోటు అయితే లేదు కాని ఆయన పెద్దరికం లేని లోటు మాత్రం క్లీయర్ గా కనిపిస్తుంది. ఆ పెద్దరికంను కొందరు ఆయనకు కట్టబెట్టాలని చూస్తుంటే కొందరు ఈయనకు కట్టబెట్టాలని చూస్తున్నారు.ఆయన ఈయన ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే ఇటీవల చిరంజీవి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ టాలీవుడ్ లో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేందుకు ముందు ఉంటాను. ఏదైనా సాయం చేయమని వస్తే ఖచ్చితంగా నేను ముందు ఉంటాను.
Mohan Babu : మోహన్ బాబు లేఖ ఉద్దేశ్యం అదేనేమో
కాని ఇండస్ట్రీ పెద్దరికం నాకు వద్దు అన్నట్లుగా వివాదాలకు దూరంగా ఉంటాను అన్నట్లుగా చిరంజీవి వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీ పెద్దరికం అనేది నెత్తిన ఎత్తుకునేందుకు తాను సిద్దంగా లేను అని.. ఒక వేళ తాను ముందుకు వస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే కొందరు తనపై మాటల యుద్దం చేసేందుకు సిద్దంగా ఉంటారని ఆయనకు తెలుసు. అందుకే చిరు పెద్దన్న పాత్రను వద్దనుకున్నాడు. చిరు వద్దనుకున్న ఆ పెద్దన్న పాత్రను మోహన్ బాబు తన భుజాలపై వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా అంటే ఔను అనే అనిపిస్తుంది.
తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన లేఖ లో ఇండస్ట్రీలో ఉన్న సమస్యల పరిష్కారంకు ముందుకు రావాలని.. ఎవరికి వారు అన్నట్లుగా కాకుండా అందరి మాట ఒక్కటి అన్నట్లుగా ఈ విషయమై పోరాటం సాగించాలి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అందరి పక్షాన తాను ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతాను అన్నట్లుగా ఉంది. టికెట్ల రేట్ల విషయంలో పెద్ద నిర్మాతలు మరియు చిన్న నిర్మాతలకు లాభంగా ఉండేలా మాట్లాడాలి అన్నట్లుగా మోహన్ బాబు సూచించాడు. మోహన్ బాబు పెదన్న పాత్రకు సిద్దంగానే ఉన్నాడు.. కాని ఆయనకు ఆ పాత్ర ఇచ్చేందుకు ఇండస్ట్రీ సిద్దంగా ఉందా అనేది అనుమానం.