RRR Movie : ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీముడో సాంగ్ వెనక అంత పెద్ద కథ ఉందా?
RRR : తెలుగు వాడి ఖ్యాతి దశదిశలా పాకేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పటికీ ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని రాజమౌలి తెరకెక్కించగా, ఈ చిత్రం తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ జీవితాలకు ఫిక్షనల్ అంశాల నేపథ్యంలో తెరకెక్కింది. సినిమాలోని ప్రతి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ పాత్ర నేపథ్యంలో వచ్చే ‘కొమురం భీముడో..కొమురం భీముడో’ అనే గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
RRR Movie : అక్కడ నుండి స్పూర్తి..
‘భీమా..నిన్ను గన్న నేల తల్లి. ఊపిరి బోసిన చెట్టుచేమ..పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుండ్రు. వినబడుతుందా’ అంటూ ప్రారంభమైన ఈ గీతం అభిమానులను ఆకట్టుకుంటున్నది. కొమురం భీమ్‌లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ సాగే ఈ పాటకు సుద్దాల అశోక్‌తేజ సాహిత్యాన్నందించారు. కాలభైరవ ఆలపించారు. కీరవాణి స్వరకర్త. కథాగమనంలో కీలక సందర్భంలో వచ్చే గీతం వెనక చాలా కథ ఉంది. థియేటర్స్ లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన ఈ సాంగ్ రూపొందించటానికి రాజమౌళి బ్రేవ్ హార్ట్ మూవీ నుండి స్ఫూర్తి పొందారట.
దర్శకుడు మెల్ గిబ్సన్ తెరకెక్కించిన హాలీవుడ్ మూవీ బ్రేవ్ హార్ట్ 1995లో విడుదలై మంచి విజయం సాధించింది. కొమరం భీముడో సాంగ్ తెరకెక్కించడానికి అక్కడి నుండి ప్రేరణ పొందారట. బ్రేవ్ హార్ట్ మూవీలో క్లైమాక్స్ చూసి రామ్ తన మిత్రుడు భీమ్ ని బ్రిటీష్ దొరల ఆదేశాల మేరకు శిక్షించేలా ఆలోచన చేశాను. కొమరం భీముడో సాంగ్ అలా తెరకెక్కించానని రాజమౌళి తెలియజేశారు. ఇక ఆ రెండు పాత్రల్లో ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడుని చూశాను అన్నారు. కాగా, హాలీవుడ్ చిత్రాల నుండి సన్నివేశాలు ఎత్తేస్తారని, కాపీ చేసి తెరకెక్కిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. రాజమౌళి మాత్రం దాన్ని స్ఫూర్తిగా చెప్పుకుంటారు.