ఆర్జీవీ.. ‘కరోనా వైరస్’ సినిమా రివ్యూ
సినిమా పేరు : కరోనా వైరస్
నటీనటులు : శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ చాగంటి, సోనియా, దొర సాయితేజ, కల్పలత గార్లపాటి, దక్షి గుత్తికొండ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : డీఎస్ఆర్
ప్రొడ్యూసర్స్ : ఆర్జీవీ, నన్నపురెడ్డి, ఎల్లారెడ్డి
డైరెక్టర్ : అగస్త్య మంజు
రిలీజ్ డేట్ : 11 డిసెంబర్ 2020
థియేటర్ లో సినిమా చూడటం అంటే ఇప్పుడో పెద్ద సాహసం అనే చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. కరోనా వైరస్ అనే మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అయింది. ఇప్పటికీ అవుతూనే ఉన్నది. కరోనా వైరస్ వల్ల మార్చిలో మూత పడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అందులోనూ థియేటర్లు తెరుచుకున్న విడుదలయిన మొదటి సినిమా కరోనా వైరస్. సినిమా పేరు కూడా కరోనా వైరసే.
కరోనా వైరస్ నేపథ్యంలోనే వచ్చిన ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మరెవరో కాదు వివాదస్పద డైరెక్టర్ ఆర్జీవీ. అయితే… కరోనా వైరస్ మహమ్మారిని క్యాష్ చేసుకోవాలనుకున్నాడో ఏమో వర్మ కానీ.. బొక్కబొర్లాపడ్డాడు.
వామ్మో.. ఈ సినిమా కరోనా వైరస్ మహమ్మారి కన్నా డేంజర్ గా ఉంది. పేరుకు ఈ సినిమా గంటన్నర నిడివి మాత్రమే కానీ.. ఈ సినిమాను గంటన్నర అలాగే థియేటర్ లో కూర్చొని సగటు ప్రేక్షకుడు చూశాడంటే ఆ ప్రేక్షకుడికి దండేసి దండం పెట్టాల్సిందే.
ఒకే ఇంట్లో సినిమా మొత్తం సాగ….దీసినట్టు ఉంటుంది. ఓ ఎనిమిది క్యారెక్టర్ల చుట్టూనే అరిగిపోయిన క్యాసెట్ లా తిరుగుతూనే ఉంటుంది. ఓ భార్యాభర్త, తన ముగ్గురు పిల్లలు, ఒక కోడలు, బామ్మ.. ఒక పనిమనిషి. అంతే వీళ్ల మధ్య జరిగేదే సినిమా.
లాక్ డౌన్ సమయంలో ఎవరైనా దగ్గినా కూడా కరోనా వచ్చిందేమో అని భయపడి.. వాళ్లకు దూరంగా పరిగెత్తిన రోజులను మనం చూశాం. ఇంట్లోనూ ఎవరైనా దగ్గితే చాలు.. వాళ్లకు కరోనా వచ్చిందేమోనని భయపడి.. వాళ్లకు దూరంగా ఉండటం… కరోనా నుంచి తప్పించుకోవడం కోసం వాళ్లు పడిన పాట్లు.. ఆ సీన్లను తెరకెక్కించడం కోసం సినిమా యూనిట్ పడిన పాట్లు మాత్రం ప్రేక్షకుడికి బాగానే గుర్తొస్తాయి.
పాజిటివ్స్
అయితే.. ఈ సినిమాలో అన్ని నెగెటివ్స్ కాకుండా.. కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నటీనటులు మాత్రం తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ చాగంటి, సోనియా ఆకుల నటన మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఉన్న అన్ని పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. నేపథ్యం సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్.
కన్ క్లూజన్
మొత్తం మీద ఈ సినిమా గురించి అంతిమ తీర్పు ఏంటంటే.. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాక చూడటానికి ఏం సినిమాలు లేవు. అందులోనూ ఈ సినిమా ఫస్ట్ టైమ్ రిలీజ్ కావడంతో.. టైమ్ పాస్ కోసం వెళ్లి చూడాలనుకుంటే చూడొచ్చు. ఆర్జీవీ సినిమాలు నచ్చేవాళ్లు కూడా ఈ సినిమా చూడొచ్చు.