Pan India : ది తెలుగు న్యూస్ విశ్లేషణ : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంప ముంచుతోన్న ‘ PAN INDIA ‘ పిచ్చి !
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా హవా నడుస్తుంది. ప్రభాస్ బాహుబలి సినిమాతో మొదలైన హవా ఇప్పటికీ నడుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ క్రేజ్ ఇంకా పెరిగింది. ఏకంగా ఆ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2, పుష్ప సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ వసూళ్లను సాధించాయి. దీంతో నిర్మాతలు భారీగా ఆదాయం అందుకున్నారు.
అయితే ఇక్కడ సక్సెస్ ఒక్కటే కాదు పరాజయల్ని తలెత్తకుండా చేయాల్సిన అవసరం ఉంది. గడిచిన రెండేళ్లలో తెలుగు నుంచి సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా సినిమాలతో పాటు రిలీజ్ అయిన చిత్రాలు పాన్ ఇండియాలో భారీ నష్టాల్ని తెచ్చిపెట్టాయి. రాధే శ్యామ్ , ఆచార్య, శాకుంతలం, లైగర్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమాను కూడా ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో కొంతమంది నిర్మాతలు హీరో మార్కెట్ ని మించి ఖర్చు చేశారు.
కేవలం దర్శక హీరోలపై నమ్మకంతో నిర్మాతలు డేరింగ్ గా ముందుకు వెళ్తున్నారు. కానీ ఫలితాలు మారిపోయే సరికి సన్నివేశం మరోలా కనిపించింది. ఈ సినిమాలు కనీసం తెలుగు రాష్ట్రాలలో కూడా విజయం సాధించక పోవడంతో నిర్మాతలు భారీగా నష్టాలు మిగిలాయి. దసరా లాంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కాకపోయినా తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా కంటెంట్ విషయంలో దర్శక నిర్మాతలు మరింత సీరియస్ గా ఆలోచించాల్సి ఉంటుంది. కాంబినేషన్స్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.