HBD Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ స్టోరీ.. జనం కోసం జనంలో ఉండే పవర్ స్టార్.. పవనిజమే యూత్ మంత్రం
HBD Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హీరో మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది అభిమానులకు ఆయన దేవుడు. అందుకే.. చాలామంది హీరోలకు అభిమానులు ఉంటారు కానీ.. పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు. ఆయన్ను గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు.. పోతుంటారు కానీ.. పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఒక్కరే ఉంటారు. ఆయన అంటే యూనిక్. నువ్వు నందా అయితే నేను బద్రీ.. బద్రీనాథ్.. అనే డైలాగ్ వేరే హీరో చెబితే చప్పబడిపోయేది కావచ్చు కానీ.. తన స్టయిల్, టెంపో, ఆటిట్యూట్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలగలిపి చెబితే ఆ డైలాగ్ కే కొత్త అర్థం వచ్చింది. బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు సినీలోకం ఫిదా అయిపోయింది. నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ వేసిన డైలాగ్ కి కుర్రాళ్లు కేరింతలు కొట్టారు.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫైట్స్ ఉండాలి.. కామెడీ ఉండాలి.. ఇంకేదో ఉండాలి అని ఏ అభిమాని కోరుకోడు. అసలు పవన్ కళ్యాణ్ ఉంటే చాలు.. ఆయన సినిమాలో అలా నడుస్తూ వెళ్లినా చాలు.. అది సూపర్ హిట్ అంటారు. పవన్ పై ఉండే అభిమానం అలా ఉంటుంది. ఏదైనా కొత్త ట్రెండ్ సృష్టించాలంటే అది పవన్ కళ్యాణ్ తర్వాతనే. డ్రెస్సుల్లో కానీ.. హెయిర్ స్టయిల్ లో కానీ యూత్ ఎక్కువగా అనుకరించేంది పవన్ నే. ఫ్యాషన్ అంటే పవన్ కళ్యాణ్ అనేంతలా యూత్ ఆయనకు అడిక్ట్ అయిపోయారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ది ఏ సినిమా విడుదల అయినా అందులో పవన్ ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా.. అలాంటి డ్రెస్సులే వేసుకోవడం.. ఫ్యాషన్ ను ఫాలో అవడం, హెయిల్ స్టయిల్ చేంజ్ చేయడం.. ఇలా యూత్ పవన్ ని అనుసరించడం మొదలు పెట్టారు.
HBD Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గా మారిన కళ్యాణ్ బాబు
పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. కానీ.. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కోసం పవన్ కళ్యాణ్ గా తన పేరును మార్చుకున్నారు. వరుసగా సినిమాలు చేసి పవర్ స్టార్ గా ఎదిగారు. తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరిచిపోలేని సినిమాలు. ఖుషీ వరకు పవన్ సినిమా కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
అయితే.. మిగితా హీరోలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదు. ఎప్పుడూ పది మంది గురించి, పది మందికి ఎలా సేవ చేయాలని ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శలు చేయని వాళ్లు లేరు. అయినా అన్నింటినీ ఎదుర్కొని పవర్ స్టార్ గా, రాజకీయాల్లో ఏపీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆయనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు కాదు.. మరో వందేళ్ల తర్వాత కూడా ఆయన పవర్ స్టారే. సినిమాల్లో ఉన్నా లేకున్నా.. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా.. ఎప్పటికీ ఆయన తన అభిమానుల గుండెల్లో మాత్రం నిలిచి ఉంటారు. అందుకే ఆయన పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు.
ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాల్లోనూ నటిస్తూ తన అభిమానులను కూడా అలరిస్తుంటారు పవన్. ఇప్పటికీ తన చేతుల్లో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓజీ టీజర్ కూడా విడుదల చేసింది మూవీ యూనిట్. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. మరో ఇద్దరు యువ దర్శకుల సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నా.. సినిమాల్లో ఉన్నా.. ఎక్కడ ఉన్నా పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణే. ఆయన ఇలాగే ఎప్పుడూ తన అభిమానులను అలరిస్తూ వాళ్లకు అండగా ఉండాలని.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ కు హ్యాపీ బర్త్ డే.