TDP : బెజవాడలో టిడిపి బోల్తా పడటానికి కారణాలేంటీ..? అమరావతి ఉద్యమం ఏమైంది ?
TDP బెజవాడ గడ్డ టిడిపి అడ్డా అని తెలుగు తమ్ముళ్లు తొడలు కొట్టే రోజులు పోయాయట. ఇప్పుడు బెజవాడ గడ్డ వైసీపీ అడ్డాగా మారిపోయింది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఊహించని ఈ ఓటమిని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. విజయవాడలో మొత్తం 64 డివిజన్లు ఉంటే అందులో వైసీపీ 49 డివిజన్లలో అత్యధిక మెజార్టీతో కార్పొరేషన్ ను చేజిక్కించుకుంది. తెలుగు తమ్ముళ్లు కేవలం 14 చోట్ల గెలవగా సిపిఎం పార్టీ 1 డివిజన్ లో ఊహించని విధంగా గెలిచింది. బెజవాడ కార్పొరేషన్ లో టిడిపి ఓటమికి ఆ పార్టీ నేతలే ప్రధానంగా కారణమయ్యారనేది ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
టికెట్ల లొల్లి
ఎంపీ కేశినేని నానీ కూతురు మేయర్ అభ్యర్థిగా పెట్టి టికెట్లు ఇంచే అంశంలో మిగిలిన నాయకులతో విభేదాలు ఏర్పడడంతో అక్కడే ఓటమి మొదలైంది. 39వ డివిజన్లో ఎంపీ కేశినేని నానీ, బుద్దా వెంకన్న, నాగూల్ మీరా అభ్యర్థి అంశంలో గొడవపడ్డారు. ఆ వార్డు సైతం వైసీపీనే గెలుచుకుంది. అక్కడ మొదలైన గొడవ పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గాని పాకడంతో రెండు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని డివిజన్లపై పడింది. దానికి తోడు ఎన్నికలు రెండు రోజుల్లో జరుగుతుండగా బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఎంపీ కేశినేనిపై నిప్పులు చెరిగారు. దీంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఆందోళనలు మిన్నంటాయి. టిడిపి డ్యామేజ్ అయ్యింది. ఫలితంగా వైసీపీ బంపర్ మెజారిటీతో బెజవాడ కార్పొరేషన్ ను చేజిక్కించుకుంది. వాస్తవంగా అమరావతి రాజధాని అంశంపై 450 రోజుల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి.
ఫలితం లేని రాజధాని వ్యతిరేకత
ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి, ప్రజాసంఘాలు, ఇతర పార్టీలతో కలిసి ఆందోళనలు చేపట్టింది. నేరుగా చంద్రబాబే వచ్చి ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినe, ఓటర్లు మాత్రం వైసీపీకే మద్దతు పలకడంతో బెజవాడ కార్పొరేషన్ వైసీపీ వశం కావడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశానికి విజయవాడవాసులు కూడా మద్దతు పలికినట్లైంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, కార్పొరేషన్ ను గెలవగా, అమరావతి అంశంపై విజయవాడలో వ్యతిరేకత లేదనే అంశాన్నివైసీపీ నిరూపించినట్లుగా అయ్యింది. దాంతో పాటే ప్రభుత్వ పాలనకు, పథకాలకు ప్రజలు ఓట్లేసారన్న అంశాన్ని వైసీపీ తన అస్త్రంగా మార్చుకుంది. భవిష్యత్ లోనూ టిడిపికి బెజవాడలో చావుదెబ్బలు తప్పేట్లు కనిపించడం లేదు. తెలుగు తమ్ముళ్లు ఇప్పటికైనా విబేధాలు, గొడవలు మానకుంటే, వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని తెలుస్తోంది. మరి తెలుగు తమ్ముళ్లు తీరు మార్చుకుంటారో, లేదో వేచి చూడాల్సిందే.