Diabetes : రోజూ వ్యాయామం చేస్తే టైప్ 2 డయాబెటిస్ రాదు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..
Diabetes : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. వేళకు నిద్రించి వేళకు నిద్రలేవాలి. అలాగే పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. ఇలా చేస్తేనే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటారు. కానీ చాలా మంది ఈ తరహా జీవనశైలిని పాటించడం లేదు. చాలా మంది లైఫ్ స్టైల్ అస్తవ్యస్తంగా ఉంటోంది. అందువల్ల వారు టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు.
అయితే నిత్యం వ్యాయామం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ (ఈఏఎస్‌డీ)కి చెందిన డయాబెటాలజియా అనే జర్నల్‌లో పలువురు సైంటిస్టులు పైన తెలిపిన విషయానికి చెందిన అధ్యయన వివరాలను ప్రచురించారు.
చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్, ఇనిస్టిట్యూట్ ఫర్ రిస్క్ అసెస్‌మెంట్ సైన్సెస్, ఉట్రెక్ట్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వ్యాయామం చేయడం, టైప్ 2 డయాబెటిస్ అనే అంశంపై పరిశోధనలు చేసి ఆయా వివరాలను వెల్లడించారు. అందుకు గాను వారు 1,56,314 మందిని పరిశీలించారు. వారిలో నిత్యం వ్యాయామం చేసే వారిలో 64 శాతం మందిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు బాగా తగ్గాయని గుర్తించారు. అయితే కాలుష్యం లేని ప్రాంతాల్లో నిత్యం వ్యాయామం చేస్తేనే ఈ ఫలితాన్ని పొందవచ్చని వారు తెలిపారు. అందువల్ల నిత్యం పచ్చని ప్రకృతి వాతావరణంలో వ్యాయామం చేస్తే టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు.