India Us Tariffs : ట్రంప్‌ సుంకాల ప్రకటనతో భారత్‌కు కలిగే లాభాలు ఇవేనా .. ?

 Authored By suma | The Telugu News | Updated on :3 February 2026,11:09 am

ప్రధానాంశాలు:

  •  India Us Tariffs : ట్రంప్‌ సుంకాల ప్రకటనతో భారత్‌కు కలిగే లాభాలు ఇవేనా .. ?

India Us Tariffs :  భారత్‌–అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగిన కీలక చర్చలు సఫలమయ్యాయి. రెండు దేశాలు ఎట్టకేలకు ఒక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు గణనీయంగా తగ్గాయి. అంతేకాదు రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించనున్న అదనపు సుంకాలను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాలు భారత్‌కు ఆర్థికంగా ఊరటనిచ్చే అంశాలుగా మారాయి.

Are these the benefits of the India-US trade agreement for India?

India Us Tariffs : ట్రంప్‌ సుంకాల ప్రకటనతో భారత్‌కు కలిగే లాభాలు ఇవేనా .. ?

India Us Tariffs : సుంకాల్లో కోత: భారత్‌కు ఊరట

అమెరికా ఇప్పటివరకు భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించేది. తాజా ఒప్పందంతో వాటిని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అదనంగా, రష్యా నుంచి చమురు దిగుమతులపై విధించాలనుకున్న మరో 25 శాతం అదనపు సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదిక ద్వారా వెల్లడించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయడానికి అంగీకరించిందని ఆయన పేర్కొన్నప్పటికీ ఈ అంశంపై భారత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

India Us Tariffs :  ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థానం

ఈ ఒప్పందం భారత్‌ను అమెరికా మార్కెట్‌లో మరింత పోటీగా నిలబెడుతోందని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చైనా, పాకిస్తాన్, వియత్నాం వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌కు తక్కువ సుంకాలు వర్తిస్తున్నాయి. బ్రెజిల్‌పై 50 శాతం, మయన్మార్, లావోస్‌లపై 40 శాతం, చైనాపై 37 శాతం, దక్షిణాఫ్రికాపై 30 శాతం సుంకాలు ఉన్నాయి. మరోవైపు వియత్నాం, బంగ్లాదేశ్‌లపై 20 శాతం, పాకిస్తాన్, మలేషియా, కంబోడియా, థాయిలాండ్‌లపై దాదాపు 19 శాతం సుంకాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై 18 శాతం మాత్రమే సుంకం ఉండడం వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక..గత కొంతకాలంగా డాలర్‌కు గిరాకీ పెరిగి రూపాయి విలువ క్షీణిస్తూ వచ్చింది. అయితే పరిణామాలతో భారత్ మార్కెట్‌లు కోలుకుంటాయని రూపాయి విలువ బలపడుతుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

India Us Tariffs :  ప్రధాని మోదీ స్పందన .. మార్కెట్లపై ప్రభావం

ఈ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ..“మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు తగ్గడం 1.4 బిలియన్ భారతీయులకు లాభదాయకం” అని పేర్కొన్నారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం ప్రజలకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా సుంకాల భయం రష్యా చమురు అంశాలతో రూపాయి బలహీనపడగా తాజా పరిణామాలతో మార్కెట్లు కోలుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిబంధనలు అమలు తేదీపై ఇరు దేశాలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రష్యా కూడా ఈ అంశంపై మౌనం పాటిస్తోంది. పూర్తి వివరాలు వెలువడితేనే ఈ ఒప్పందం ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్పష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి