తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్?
తెలంగాణ నిరుద్యోగులకు బంగారం లాంటి వార్తను చెప్పారు సీఎం కేసీఆర్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల నోరును తీపి చేశారు. త్వరలోనే తెలంగాణలో కొలువుల జాతర జరగనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్లు, పోలీస్ పోస్టుల కోసం త్వరలోనే నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 50 వేల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. టీచర్లు, పోలీస్ పోస్టులతో పాటు.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇతర పోస్టులను కూడా భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఈసందర్భంగా వెల్లడించారు.
దానికోసం.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించాలంటూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఖాళీలు ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించిన అనంతరం.. వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేసి… నియామక ప్రక్రియను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్నాళ్లుగా వేచి చూసిన తరుణం వచ్చిందని.. నిరుద్యోగులంతా ఉద్యోగాల ప్రిపరేషన్ ను ప్రారంభించారు.