IND vs NZ, 1st T20I: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలుపుకు కారణం ఆ ఇద్దరే !!
IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్‌తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి పోరులో టీమిండియా 48 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్, ఓపెనర్ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84) సృష్టించిన సునామీతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లతో కివీస్ బౌలర్లను హడలెత్తించగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) అతనికి చక్కని సహకారం అందించారు. ఈ భారీ స్కోరుతో భారత్ మ్యాచ్‌పై ఆదిలోనే పట్టు సాధించింది.
IND vs NZ, 1st T20I: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలుపుకు కారణం ఆ ఇద్దరే !!
ఈ మ్యాచ్‌లో అసలైన మలుపు రింకూ సింగ్ ఇన్నింగ్స్‌తో వచ్చింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ, సుదీర్ఘ విరామం తర్వాత దక్కిన అవకాశాన్ని అద్భుతంగా మలచుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు పిండుకుని టీమిండియా స్కోరును 200 దాటించి, విక్టరీ టార్గెట్‌ను కివీస్‌కు అందనంత ఎత్తులో నిలిపాడు. రింకూ మెరుపులు మెరిపించకపోయి ఉంటే భారత్ స్కోరు తక్కువకే పరిమితమయ్యేదని, అప్పుడు కివీస్ సులభంగా గెలిచేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అనంతరం 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (78) ఒంటరి పోరాటం చేసినా, భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీయగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన టీమిండియా, శుక్రవారం రాయ్‌పూర్‌లో జరగబోయే రెండో టీ20 కోసం ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.