YS Jagan : ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతోంటే, ఈ రాజకీయ లొల్లి ఏంటి.?
YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ పోరం వేదికగా దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంటే, చిత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీతి మాలిన రాజకీయాలు రాష్ట్రం పరువుని బజారుకీడ్చుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం కొత్త జిల్లాగా ఏర్పడింది. ఆ జిల్లాకి కోనసీమ పేరుని ప్రభుత్వం పెట్టగా, దాన్ని అంబేద్కర్ జిల్లాగా మార్చాలనే డిమాండ్లు వచ్చాయి. విపక్షాలు కూడా, జిల్లా పేరు మార్పు విషయమై డిమాండ్లు చేశాయి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. జిల్లా పేరు మార్పు విషయమై వచ్చిన డిమాండ్లు, వినతుల నేపథ్యంలో ప్రభుత్వం, కోనసీమ జిల్లా పేరు మార్చుతూ ప్రకటన విడుదల చేసింది.
ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇంతలోనే అనూహ్యమమైన కుదుపు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అలజడి. కనీ వినీ ఎరుగని రీతిలో విధ్వంసం. మంత్రి ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు లక్ష్యంగా అల్లరి మూకలు దాడులు చేసి, తగలబెట్టాయి. ఆ తర్వాత అసలు రాజకీయం మొదలైంది. విపక్షాల విమర్శలు, ఆ విమర్శల్ని తిప్పికొట్టేందుకు అధికార పక్షం పాట్లు.. వెరసి, రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు దాపురించాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో, రాష్ట్రం బాగు కోసం పెట్టుబడుల్ని సమీకరిస్తోంటే, రాష్ట్రంలో రాజకీయాలు ఇలా తగలబడిపోవడమేంటి.? కోనసీమ జిల్లా పేరు మార్పు విషయమై అభ్యంతరాల స్వీకరణకు తగిన గడువు వుంది.
రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులు తమ అభ్యంతరాల్ని, అభ్యర్థల్ని తెలిపే వీలున్నప్పుడు విధ్వంసాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏవరో కావాలనే తెరవెనుకాల వుండి ఈ విధ్వంసాలకు వ్యూహ రచన చేసిన విషయం అర్థమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోనసీమ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంత జరిగాక కూడా, జిల్లా పేరు విషయమై కొందరు ఆందోళనకారులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుండడం, రహస్య సమావేశాలు, అనూహ్యమైన రీతిలో నిరసన ప్రదర్శనలు చేపట్టడం వెనుక, రాజకీయ ప్రేరేపిత ఉద్దేశ్యాలు లేవని అనగలమా.? ముఖ్యమంత్రి దావోస్ పర్యటన లక్ష్యాలు సాకారమవుతున్న వేళ, ఆ విజయాలు ప్రజలకు కనిపించనీయకుండా చేసేందుకే ఈ కుట్రలన్నది అధికార పక్షం వాదనగా కనిపిస్తోంది.