Mount Kilimanjaro : 9 ఏళ్లకే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అనంతపురం బాలిక
Mount Kilimanjaro : కిలిమంజారో.. కిలిమంజారో యారో యారో.. ఒహో.. ఒహో.. కన్ను చూస్తే.. అంటూ రోబో సినిమాలో కిలిమంజారో పర్వతం మీద సూపర్ స్టార్ రజనీకాంత్, మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ కలిసి వేసిన స్టెప్పులు గుర్తున్నాయా? కిలిమంజారో అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్న ఎత్తయిన పర్వతం. ఆ పర్వతాన్ని ఎవ్వరి సాయం లేకుండా సొంతంగా ఎక్కేసింది ఓ చిన్నారి. తన వయసు కేవలం 9 ఏళ్లు. అంత చిన్న వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. అందరితో శెభాష్ అనిపించుకుంటోంది.
రిత్వికశ్రీ అనే చిన్నారిది అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం అగ్రహారం గ్రామం. తనకు చిన్నప్పటి నుంచి ఏదైనా అడ్వెంచర్ చేయడం ఇష్టం. దీంతో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు.. తమకు ఆర్థిక సాయం కావాలని.. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడును రిత్విక తండ్రి సంప్రదించాడు.
దీంతో వెంటనే ఆయన స్పందించి.. రిత్విక.. పర్వతాన్ని అధిరోహించేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తా అని మాటిచ్చారు. దీంతో రిత్విక శ్రీ ప్రయాణం ప్రారంభం అయింది. ఇండియా నుంచి ఆఫ్రికాలోని టాంజానియా అనే దేశానికి వెళ్లి.. అక్కడి నుంచి కిలిమంజారో పర్వతాన్ని రిత్విక అధిరోహించింది.
Mount Kilimanjaro : పర్వతంపై కలెక్టర్ చిత్రపటాన్ని ప్రదర్శించిన రిత్విక
పర్వతాన్ని అధిరోహించిన వెంటనే.. రిత్విక తన భారత జాతీయ జెండాతో పాటు.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఫోటోలను రిత్విక అక్కడ ప్రదర్శించింది.
ఇంత చిన్న వయసులో అంత పెద్ద పర్వతాన్ని అధిరోహించిన రిత్వికకు కలెక్టర్ చంద్రుడు అభినందనలు తెలియజేశారు. ప్రతిభ ఉన్న చిన్నారి కాబట్టి.. తనకు తోచిన సాయం చేశానని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్.. చిన్నారి రిత్వికకు సుమారు 3 లక్షల రూపాయలను ఆర్థిక సాయాన్ని అందించారు. ఆ డబ్బుతోనే రిత్విక పర్వతాన్ని అధిరోహించింది.