Schools Holiday : మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Schools Holiday : తెలంగాణలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి.. విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం.. మూడు రోజులు వరుసగా భారీ వర్షాల వల్ల.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
అయితే.. ఇప్పటికీ భారీ వర్షాలు తగ్గకపోవడంతో అన్ని విద్యాసంస్థలకు మరో మూడు రోజులు తెలంగాణ ప్రభుత్వం సెలవులను పొడిగించింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. రవాణా ఆగిపోయింది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు అంటే గురువారం, శుక్రవారం, శనివారం.. 14 జులై నుంచి 16 జులై వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వచ్చే సోమవారం నుంచి అంటే జులై 18 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు, వాగులు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. రోడ్ల మీదికి నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఇంకో రెండు మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని హెచ్చరించింది.