రామలక్ష్మణులాంటి అన్నాతమ్ముళ్ల మధ్య చిచ్చుపెట్టిన రాజకీయం..!
ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల మీద వైఎస్ జగన్ కు అవగాహన ఉంది. అంతే కాదు, టీడీపీ ఎక్కడ బలంగా ఉందో చూసి మరీ గట్టి దెబ్బ కొడుతున్నారు. అదే విధంగా తెల్లారిలేస్తే తన మీద పెద్ద నోరేసుకుని విరుచుకుపడిపోతున్న నేతలకు కూడా సమయం చూసి షాక్ ఇచ్చేయడం వైఎస్ జగన్ కి అలవాటే. విశాఖ జిల్లా విషయానికి వస్తే తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంట్లో కుంపటి పెట్టి ఆయన్ని పాతిక వేల ఓట్ల తేడాతో ఓడించిన వైఎస్ జగన్మోహనరెడ్డి .. ఇప్పుడు మరో షాకిచ్చారు. ఏకంగా ఆయన తమ్ముడు సన్యాసిపాత్రుడు కుటుంబానికి కేబినెట్ ర్యాంక్ పదవిని వైఎస్. జగన్ కట్టబెట్టారు.
విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్ పర్సన్ గా అయ్యన్నపాత్రుడు మరదలు అనితను నియమించి టీడీపీకే నోట మాట రాకుండా చేశారు. అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసిపాత్రుడు ఎన్నికల ముందు వైసీపీలో చేరి అన్న ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అయ్యన్నపాత్రుడు ఓటమిలో సన్యాసిపాత్రుడుకు వాటా కూడా ఉంది. ఇక ఈ మధ్య జరిగిన నర్శీపట్నం మునిసిపాలిటీ ఎన్నికల్లో కూడా అయ్యన్న కుటుంబం ఓటమికి కీ రోల్ ప్లే చేశారు. దానికి బహుమతిగా సన్యాసిపాత్రుడు సతీమణి అనితకు ప్రతిష్టాత్మకమైన పదవినే వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో సన్యాసిపాత్రుడు ఇంట ఆనందం తాండవిస్తూండగా అయ్యన్నపాత్రుడు మాత్రం ఇరకాటంలో పడ్డారని కేడర్ చర్చించుకుంటోంది.
చేజేతులారా.. Ayyanna Patrudu And sanyasi Patrudu
రామలక్ష్మణులుగా మెలిగిన అన్నాతమ్ముళ్ల మధ్య రాజకీయమే చిచ్చు రేపింది. అయ్యన్నకు అండదండగా మారిన సన్యాసిపాత్రుడికి రాజకీయంగా భవిష్యత్ లేకుండా చేయాలన్న దురాశే.. ఇప్పుడీ పరిస్థితికి కారణమని స్థానికంగా చర్చ సాగుతోంది. అయ్యన్నపాత్రుడు తమ్ముడైన సన్యాసిపాత్రుడిని పక్కన పెట్టేసి, తన కొడుకు విజయ్ పాత్రుడికే పట్టం అనడమే ఈ దుస్థితికి కారణమని కేడర్ చర్చించుకుంటోంది. దాంతో మూడు దశాబ్దాల రాజకీయ బంధాన్ని సన్యాసిపాత్రుడు తెంచుకున్నారు.
వైసీపీలోకి చేరిన సన్యాసిపాత్రుడు భార్య అనిత.. గతంలో నర్సీపట్నం మునిసిపాలిటీ వైఎస్ చైర్ పర్సన్ గా గత అయిదేళ్లు పనిచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సన్యాసిపాత్రుడికి వైఎస్. జగన్ బిగ్ ఆఫర్ ఇచ్చేశారు. ఇప్పటివరకు అయ్యన్నపాత్రుడు రాజకీయం అంతా తమ్ముడు సన్యాసిపాత్రుడు మీదనే ఆధారపడి సాగింది. అయ్యన్న ఎక్కడా ఉన్నా తమ్ముడు అందుబాటులో అటు ప్రజలకు, ఇటు కేడర్ కి ఆధారంగా ఉండేవారు.. దీంతో ఇదే అదునుగా వైఎస్ జగన్ మరింత దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతున్నారని, అందుకే పదవి అని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.