Bhadrachalam : భద్రాచలం ఎవరిది.? తెలంగాణదా.? ఆంధ్రప్రదేశ్‌దా.?
Bhadrachalam : భద్రాద్రి రాముడు ఎవరి వాడు.? తెలంగాణ వాడా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడా.? అసలు దేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడనే చర్చ ఏంటి.? ‘మీకు భద్రాద్రిని అభివృద్ధి చేయడం చేతకాకపోతే మాకు ఇచ్చేయండి..’ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని. దాంతో, భద్రాద్రి రాముడిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.అసలు భద్రాద్రి రాముడు ఎవరివాడు.? ఇప్పుడైతే తెలంగాణలో వున్నాడు గనుక.. ఆయన తెలంగాణ రాముడు. చాలా ఏళ్ళ క్రితం భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగం కాబట్టి, అప్పట్లో ఆయన ఆంద్రా రాముడన్నమాట.
ఆంధ్రా రాముడు కాదు, నిజానికి తెలంగాణ రాముడు.. తెలంగాణకు చెందిన భక్తుడు రామదాసు కట్టించిన గుడిలో కొలువు దీరిన రాముడు.. తెలంగాణోడే.. అన్నది తెలంగాణ వాదన.ఎవరి గోల వారిదే.! వరద తెచ్చిన బురద రాజకీయం నేపథ్యంలో భద్రాద్రి రాముడు ఎవరివాడన్న చర్చ జరుగుతోంది. చరిత్రలోకి తొంగి చూస్తే, ఇద్దరు చెబుతున్నదీ నిజమే. తెలంగాణ, ఆంధ్ర, మళ్ళీ తెలంగాణ.. ఇంకోసారి ఆంధ్రా అవుతుందా.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి, ఆ ఛాన్సే లేదు.భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగం.
అయితే, పరిపాలనా సౌలభ్యం, రవాణా సౌకర్యం.. ఇలా చాలా కారణాలతో తూర్పుగోదావరి జిల్లా నుంచి వేరుపడి, ఖమ్మంలో కలిసింది ఇప్పుడున్న భద్రాచలం ప్రాంతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని కొంత భాగం, తిరిగి తూర్పుగోదావరి జిల్లాలో కలిసింది. కొంత పశ్చిమగోదావరి జిల్లాలోనూ కలిసింది. అదీ అసలు కథ. చరిత్ర, చింతకాయ.. ఎవడిక్కావాలి.? ఇప్పుడు అక్కడి ప్రజల్ని తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా చూసుకుంటున్నాయా.? లేదా.? అన్నదే చర్చ.