KCR | కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట
KCR | తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత హరీష్ రావులకు తాత్కాలిక ఊరట లభించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7న ప్రధాన పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో, ఆ దాకా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది.

#image_title
కాస్త ఊరట…
కేసీఆర్, హరీష్ రావుల తరఫున వాదనలు వినిన హైకోర్టు, దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపింది. అప్పటి వరకూ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులు ఎలాంటి చర్యలకు దిగకూడదని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో తలెత్తిన లోపాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ప్రాజెక్ట్‌లో అవినీతి లేదని నిరూపించాలంటే నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని పేర్కొంటూ, CID లేదా SIT కంటే కేంద్ర సంస్థ అయిన సీబీఐకి అప్పగించడం సమంజసమని ప్రభుత్వం భావించినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతికి బాధ్యులు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులేనని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లో వారి వ్యక్తిగత లాభాల కోసం వ్యవహరించారని ఆమె విమర్శించారు.