Munugodu Bypoll : మునుగోడులో ఇంటర్నల్ సర్వే చేయించిన బీజేపీ.. సర్వేలో ఎవరు గెలుస్తారని తేలిందంటే?
Munugodu Bypoll : ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా మునుగోడులో విడుదల కాలేదు. కానీ.. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ మునుగోడులో బైపోల్ కోసం ప్రచారాన్ని ప్రారంభించాయి. కొన్ని పార్టీల నేతలైతే అక్కడే తిష్ట వేశారు. ఇప్పటి నుంచి మునుగోడు ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోటాపోటీగా ప్రధాన పార్టీలన్నీ మునుగోడులో రాజకీయాలను వేడెక్కించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలే మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఈనేపథ్యంలో బీజేపీ స్టీరింగ్ కమిటీ సారథి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. దానికి కారణం.. బీజేపీ పార్టీ ఇంటర్నల్ గా మునుగోడులో చేయించిన సర్వే. బీజేపీ మొదటి ప్లేస్ లో ఉందని, రెండో స్థానం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అసలు.. మునుగోడులో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనని ఈసందర్భంగా వివేక్ స్పష్టం చేశారు. కేవలం పార్టీ కోసమే మునుగోడులో ఇంటర్నల్ సర్వే నిర్వహించామని వివేక్ తెలిపారు.
Munugodu Bypoll : మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి వైపే ఉన్నారన్న వివేక్
ఇక్కడ రాజకీయాలను పక్కన పెడితే.. మునుగోడు ప్రజలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మమేకమయ్యారు. ఆయనకు మునుగోడు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఆయన కరోనా సమయంలో కూడా అండగా ఉన్నారు. నియోజకవర్గంలో అనుక్షణం పర్యటించి వాళ్లకు భరోసా కల్పించారు. అందుకే.. మునుగోడులో వారు వన్ సైడే. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల గురించి మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. మునుగోడులోనే కాదు.. తెలంగాణలో బీజేపీ పాలన రావాలని రాష్ట్ర ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారని వివేక్ ఈసందర్భంగా తెలిపారు.