బీజేపీ ప్లాన్ అదుర్స్ కానీ.. వైసీపీ, టీడీపీని టచ్ కూడా చేయలేకపోతోంది?
బీజేపీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీ గురించే చర్చ. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఈ పార్టీ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే తన దూకుడును పెంచింది. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ పార్టీకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దుబ్బాక ఉపఎన్నికతో పాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చిన సీట్లు చూస్తే.. తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు అని అనిపిస్తోంది. అందులోనూ అక్కడ బిజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్.. బీభత్సంగా రెచ్చిపోయారు. బీజేపీ వేసిన ప్లాన్ లో అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు.. కాంగ్రెస్ కూడా పడిపోయింది. దీంతో బీజేపీ తన ప్లాన్ ను అమలు చేసుకుంటూ వెళ్లిపోయింది.
సేమ్.. ఇదే స్ట్రాటజీని ఏపీలో ఉపయోగించాలని భావిస్తోంది బీజేపీ. మరి.. ఇదే స్ట్రాటజీని ఉపయోగించాలంటే.. ఏపీలో కూడా బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ ఒకరు కావాలి కదా. ఒకరు కాదుకానీ.. ఏపీలో చాలామంది బీజేపీ నేతలు మాంచి దూకుడు మీదున్నారు. అధికార వైసీపీ, టీడీపీ పార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ వలలో ఈ పార్టీలు చిక్కితే చాలు.. ఇక ఎన్నికల్లో గెలుపు అనేది పెద్ద సమస్య కాదు అనే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. త్వరలో తిరుపతి ఉపఎన్నిక రావడంతో.. తిరుపతి టికెట్ ను కూడా బీజేపీ ఇప్పటికే కన్ఫమ్ చేసుకుంది.
తమ మిత్రపక్షమైన జనసేనకు ఈసారి కూడా మొండిచెయ్యి చూపించి.. తిరుపతి ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది బీజేపీ. ఇక.. తిరుపతిలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా ప్లాన్ చేసింది. పార్టీలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు బీజేపీ నాయకులు.
కానీ.. బీజేపీ ట్రాప్ ను ముందే అర్థం చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు.. అసలు బీజేపీ పార్టీనే పట్టించుకోవడం మానేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిని బీజేపీ నేతలు తవ్వి తీస్తున్నా.. టీడీపీ శ్రేణులు మాత్రం చప్పుడు చేయడం లేదు. అలాగే వైసీపీ కూడా అంతే. దీంతో ఏం చేయాలో తెలియక బీజేపీ నేతలు నెత్తి గోక్కుంటున్నారు.