BRS : ఈ పది స్థానాల్లో హస్తం గెలుపు ఫిక్స్ చేసిన బీఆర్ఎస్?
BRS : అదేంటి అని టైటిల్ చూసి షాక్ అవుతున్నారా? ఎవరైనా తమ పార్టీ గెలవాలని కోరుకుంటారు. తమ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు కానీ.. వేరే పార్టీ గెలవాలని ఎవరు అనుకుంటారు అని పెదవి విరుస్తున్నారా? ఇక్కడే మీరు సీఎం కేసీఆర్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. కానీ మిస్ ఫైర్ అయింది. టికెట్ రాని వాళ్లు పార్టీపై మండిపడుతున్నారు.
కొన్ని జిల్లాలో వేరే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం, మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు మాత్రం అస్సలు ఆగడం లేదు. జనగామ నియోజకవర్గంలో చూస్తే ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా రాజేశ్వర్ రెడ్డిగా ఉంది. ముత్తిరెడ్డిని కాదని.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తారా? ఇక్కడ బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నాయి. నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ తనకే ఇవ్వాలని మదన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నర్సాపూర్, జనగామ లాంటి నియోజకవర్గాలకు టికెట్లు కేటాయించకపోవడంపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదు.
BRS : ములుగు బీఆర్ఎస్ లో పెరిగిన అసమ్మతి లొల్లి
ములుగు బీఆర్ఎస్ లోనూ అసమ్మతి పెరిగింది. పార్టీపై సీనియర్ నాయకుడు పొలిక గోవింద్ నాయక్ అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ కోసం ఎంతో కష్టపడితే పార్టీ నుంచి తనకు టికెట్ దక్కలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనతో మాట్లాడటానికి మంత్రి ఎర్రబెల్లి, సత్యవతి, ఇతర నాయకులు వెళ్లి బుజ్జగించారు. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారట. మరోవైపు సూర్యాపేట బీఆర్ఎస్ లోనూ అంతర్గత పోరు మొదలైంది. మంత్రి జగదీశ్ రెడ్డి, జానయ్య యాదవ్ మధ్య పోరు మొదలవడంతో అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతోంది. ఇలా రాష్ట్రంలోని ఓ 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కాబోతున్నాయి.