YCP : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీనీ ఢీకొనే సత్తా వుందా.?
YCP : నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కొన్నాళ్ళ క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. మంత్రిగా కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. విద్యావంతుడు అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి. మంత్రి హోదాలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చి, రాష్ట్రం తరఫున పలు ఒప్పందాలు కుదుర్చుకుని, స్వదేశానికి వచ్చిన వెంటనే దురదృష్టవశాత్తూ గుండెపోటుకు గురయ్యారు.మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
గతంలో వైసీపీ ఎంపీగా కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి పని చేశారు. మేకపాటి కుటుంబానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. ఆ కారణంగానే మేకపాటి గౌతమ్ రెడ్డికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. జీవించి వుంటే మంత్రిగా ఆయన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత కూడా కొనసాగించేవారే. కాగా, జూన్ 23న ఆత్మకూరు ఉప ఎన్నిక జరగనుంది. 26వ తేదీన ఎన్నికల ఫలితాల్ని వెల్లడిస్తారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గ ప్రజలతో మమేకం అయి వున్నారు. ఇదిలా వుంటే, భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ఆత్మకూరులో నిలబెడతామని చెబుతోంది.
తెలుగుదేశం పార్టీ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. జనసేన పార్టీ పోటీ చేయకపోవచ్చు. ఎందుకంటే, గౌతమ్ రెడ్డి తనకు ఆత్మీయుడని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చెప్పారు. టీడీపీలో కూడా పలువురితో గౌతమ్ రెడ్డికి ఆత్మీయ సంబంధాలు వుండేవి. వివాద రహితుడు కావడంతో, గౌతమ్ రెడ్డి పట్ల గౌరవ భావంతో అయినా, ఇతర రాజకీయ పార్టీలేవీ ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తమ అభ్యర్థుల్ని పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పోటీ చేసినా, వైసీపీని ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకీ లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైసీపీదే విజయమని తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక అలాగే బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిరూపించాయి. స్థానిక ఎన్నికల ఫలితాల సంగతి సరే సరి.