ChandraBabu : జనసేనను వైసీపీ మీదకు ఉసిగొల్పుతున్న చంద్రబాబు
ChandraBabu : ‘మేం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోబోం..’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్క మాట చెప్పేస్తే, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు నెలకొన్న ‘దత్తత వివాదం’ సద్దుమణిగిపోతుంది. తెలుగుదేశం పార్టీ బాటలోనే జనసేనాని నడుస్తున్న దరిమిలా, ఆ విషయాన్ని జనానికి అర్థమయ్యేలా చెప్పడానికి అధికార వైసీపీ తనకున్న అన్ని వనరుల్నీ సద్వినియోగం చేసుకుంటోంది. దీన్ని ఇప్పుడున్న రాజకీయాల్లో తప్పు పట్టడానికే లేదు.తమపై ‘దత్త పుత్రుడు’ అనే ముద్ర పడటానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనని గుర్తించే పరిస్థితుల్లో జనసేన పార్టీ లేకపోవడం శోచనీయం. జనసేన పార్టీ మీద ‘దత్తత’ ముద్ర వేయించేందుకు చంద్రబాబు తెరవెనుకాల రచించిన వ్యూహాలు జనసేనకు అర్థం కాకపోవడమేంటోగానీ, ఈ అవకాశాన్ని వైసీపీ మేగ్జిమమ్ సద్వినియోగం చేసుకుంటోంది.
‘మేమిద్దరం విడివిడిగా పోటీ చేస్తాం..’ అని జనసేన కూడా చెప్పలేకపోవడానికి కారణమేంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేతను దత్త పుత్రుడిగా అభివర్ణించడంపై, జనసేన నాయకులు కొందరికి అసహనం పెల్లుబికింది.వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలు పుత్రుడిగా.. జైలు రెడ్డిగా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన విమర్శిస్తే ప్రయోజనం వుండదు. ‘మేం టీడీపీ వైపు వెళ్ళం.. ఒంటరిగా పోటీ చేస్తాం..’ అని జనసేన చెప్పగలిగితే, ఆ జనసేన మీద వైసీపీ కూడా విమర్శలు చేయదు. ఎందుకంటే జనసేన అసలు వైసీపీకి రాజకీయ ప్రత్యర్థే కాదు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ మీద ‘దత్తత ముద్ర’ వెయ్యాలి, దాన్ని తాము ఎంజాయ్ చేయాలి.. అన్న కోణంలోనే చంద్రబాబు రాజకీయ వ్యూహాలు నడుస్తున్నాయి. దాని వల్ల ఆయనకు కలిగే రాజకీయ ప్రయోజనం నిజానికి ఏమీ లేదు. కానీ, జనసేన దెబ్బ తినడమే చంద్రబాబు కోరుకుంటున్నది.వాస్తవానికి టీడీపీ కంటే, జనసేన పార్టీనే తమకు ప్రతిపక్షంగా వుండాలని వైసీపీ కోరుకుంటున్న మాట వాస్తవం. ఆ అవకాశాన్ని జనసేన వదులుకుంటోంది, టీడీపీకి రాజకీయ లబ్ది చేకూర్చేందుకు జనసేన ప్రయత్నిస్తోంది కూడా. దీన్నే ఎండగడుతోంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.