ChandraBabu : బీజేపీ విషయంలో చంద్రబాబు ‘దింపుడు కళ్ళెం’ ఆశలు.!
ChandraBabu : ఇదే చివరాఖరి అవకాశం.. అంటూ ఒకటికి వందసార్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వలపు బాణాల్ని సంధిస్తూనే వున్నారు. జనసేన మీదకు ఆయన సంధిస్తున్న బాణాలు సత్ఫలితాలనిస్తున్నాయో, వృధా అవుతున్నాయో చంద్రబాబుకే అర్థం కాని పరిస్థితి. అయినాగానీ, చంద్రబాబు తన ప్రయత్నాలు మానడంలేదు. జనసేన మీదకే కాదు, భారతీయ జనతా పార్టీ మీదకి కూడా చంద్రబాబు రాజకీయ వలపుబాణాలు దూసుకెళుతున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ చంద్రబాబు అదే తరహా వన్ సైడ్ లవ్ ప్రదర్శిస్తుండడం. 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారతాయని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు.
గతంలోలా బీజేపీకి జాతీయ స్థాయిలో బంపర్ మెజార్టీ వచ్చే అవకాశం లేదనేది చంద్రబాబుకి అందిన ఫీడ్ బ్యాక్ అట. ఈలోగా జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు లెక్కలేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయా పార్టీల విషయమై సమదూరం పాటిస్తున్నట్లే, అన్నటి మీదా ఓ కర్చీఫ్ వేసినట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పంచన చేరనీయకుండా వైసీపీ, ఢిల్లీలో మంత్రాంగం నడుపుతోంది. ఈ మొత్తం వ్యవహారం వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి డీల్ చేస్తున్నారట.బీజేపీ అధిష్టానంతో విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి.
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కోసం, బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డి సఖ్యతగా వుండడం తప్పనిసరిగా మారింది. విజయసాయిరెడ్డి అడ్డు పడకపోయి వుంటే, జాతీయ స్థాయిలో చంద్రబాబు అండ్ టీమ్ ప్రయత్నాలు కొంతమేర సఫలమయ్యేవనే అభిప్రాయం వుండనే వుంది. ఎందుకంటే, ఢిల్లీలో చంద్రబాబుకి దూతలెక్కువ. అంతెందుకు, బీజేపీలోనే చంద్రబాబు మనుషులు వున్నారాయె. కాంగ్రెస్ పార్టీలో కూడా చంద్రబాబుకి పలుకుబడి వుంది. అన్నీ వుండి ఏం లాభం.? అసలంటూ ఆయనకు లేనిదే చిత్తశుద్ధి, విశ్వసనీయత. అదే అతి పెద్ద సమస్య.