Chintamaneni : టీడీపీ నేత చింతమనేని చిందులు కొత్తేమీ కాదుగానీ.!
Chintamaneni : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదమైన రాజకీయ నాయకుడు ఎవరు.? అంటే, చింతమనేని ప్రభాకర్ పేరే వినిపిస్తుంది. ఓ ప్రజా ప్రతినిథి ఎలా వుండకూడదో చింతమనేని ప్రభాకర్ చూపించారు.. చంద్రబాబు హయాంలో చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. లెక్కలేనన్ని కేసులున్నాయి ఆయన మీద. అవన్నీ రాజకీయ కుట్రలతో పెట్టిన కేసులేనంటారు చింతమనేని. చిత్రమేంటంటే, టీడీపీ అధికారంలో వున్నప్పుడు, టీడీపీ ప్రజా ప్రతినిథిగా ఆయన వున్నప్పుడూ చాలా కేసులు ఆయన మీద నమోదయ్యాయి. అధికారులంటే లెక్కలేదు.. పోలీసులంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యతా లేదు..
ఇదీ చింతమనేని ప్రభాకర్ అంటే. ఎవర్నయినా తూలనాడతాడాయన. కోడి పందాలంటే భలే ఇష్టం. ఈసారి తెలంగాణలో చింతమనేని ప్రభాకర్ బుక్ అయ్యారు. అదీ, హైద్రాబాద్ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే అభియోగాల నేపథ్యంలో. తృటిలో ఆయన పోలీసుల నుంచి తప్పించుకున్నారట.
చింతమనేని ప్రభాకర్ గురించి పోలీసులు గాలిస్తున్నట్లు.. అధికారిక ప్రకటనే వచ్చింది. ఇంతలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా తనదైన వివరణ ఇచ్చారు. కుట్ర పూరిత రాజకీయమంటూ మండిపడ్డారు. అటు ఏపీ సర్కారునీ, ఇటు తెలంగాణ సర్కారునీ విమర్శించేశారు. తెలంగాణలో బుక్కయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకీ, అక్కడి ప్రభుత్వానికీ ఏంటి సంబంధం.?
చింతమనేని అంటేనే అంత. ఆ మాటకొస్తే, టీడీపీ నేతల్లో చాలామంది పరిస్థితి ఇదే. మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై గతంలో హైద్రాబాద్‌లో ఏకంగా కిడ్నాప్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. అప్పుడూ ఇవే బుకాయింపులు. అయితే, ఇలాంటి కేసులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాగతీతకు గురవుతుండడంతో.. తప్పు చేశారా.? లేదా.? అన్నదానిపై అనుమానాలు పెరిగిపోతుంటాయ్.
అదే, ఆ వెసులుబాటే ఇలాంటి రాజకీయ నాయకులకు ఓ వరం. చేతనైతే చింతమనేని ప్రభాకర్ మీడియా ముందుకు రావాలి.. ఈ కేసులో పోలీసుల యెదుటకు వచ్చి, వారికి వివరణ ఇచ్చి.. నిర్దోషి అయితే, ధైర్యంగా దాన్ని నిరూపించుకోవాలి.