YS Jagan : వైఎస్ జగన్ ‘దావోస్’ టూర్‌పై టీడీపీ మార్క్ రాజకీయం.!
YS Jagan : అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చేసిన పబ్లిసిటీ స్టంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏమయ్యింది అమరావతి.? ఆ అమరావతి ఇప్పుడెలా వుంది.? అని ఆలోచిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణంగా అమరావతి ప్రాజెక్టు ఆగిపోయిందనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారమే కనిపిస్తుంది తప్ప, చంద్రబాబు హయాంలో కేవలం పబ్లిసిటీ తప్ప, పని జరగలేదన్న వాస్తవం బయటకు రాదు. వివిధ దేశాల్లో రాజధాని అమరావతి ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు బృందం విహార యాత్రలు చేసింది. బోల్డంత ప్రజా ధనాన్ని వృధా చేసింది.
ఆనాటి ఆ వృధా ఖర్చు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అమరావతిలో అణు ఇంధన కర్మాగారం.. అని పాకిస్తాన్ మీడియా చెప్పుకునే స్థాయికి అమరావతిలో కొన్ని డిజైన్లను అప్పట్లో చంద్రబాబు గీయించడం చూశాం. దావోస్ పర్యటనలన్నారు, ఇంకేవేవో చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు, వాటికి ఒప్పందాలనీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ, వచ్చిన పెట్టుబడులెంత.? వాటి వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత.? అంటే ఇప్పుడు టీడీపీ పెదవి విప్పలేదు, విప్పదు కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళుతున్నారన్న విషయం ఖరారయ్యాక, టీడీపీ అలాగే టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం తీవ్రస్థాయిలో మొదలు పెట్టింది.
కోర్టు నుంచి అనుమతి తీసుకుంటే తప్ప, విదేశాలకు వెళ్ళలేని ముఖ్యమంత్రి.. అని కూడా ఎగతాళి చేశారు. ఈ తరహా విమర్శల్ని వైఎస్ జగన్ ఓపికగా భరించారు. రాష్ట్రం కోసం తాను చెయ్యాల్సినదల్లా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఆర్భాటంలా కాకుండా, హుందగా దావోస్ బయల్దేరారు. అక్కడ రాష్ట్రానికి రావాల్సిన పెట్టబడులపై బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.? ప్రచార ఖర్చు తగ్గించుకుని, తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకుండా.. కేవలం సరైన సమాచారం ఇచ్చేలా మాత్రమే వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటన సక్సెస్ అయి తీరుతుంది. కానీ, వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వం మీదా దావోస్ పర్యటన నేపత్యంలో టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారమైతే కొనసాగుతూనే వుంటుంది.