TRS : టీఆర్ఎస్ కు గడ్డుకాలం.. సాగర్ లోనూ డౌటే.. మెగా ప్లాన్ వేసిన కేసీఆర్?
TRS CM KCR : సీఎం కేసీఆర్.. రాజకీయ చతురతలో దిట్ట. ఆయన వేసే ఎత్తుగడల ముందు ఎవ్వరైనా దిగదుడుపే. కేసీఆర్ కు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ప్రజలను ఎలా మెప్పించాలి.. ప్రతిపక్షాలకు ఎలా సమాధానం చెప్పాలి.. పార్టీ నేతలను ఎలా సముదాయించాలి.. ఇలా.. రాజకీయాలను ఔపోసన పట్టారు కాబట్టే నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో సారి పీఠం ఎక్కారు.
అయితే.. దుబ్బాక ఉపఎన్నిక ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఢోకా లేదు. దీంతో సీఎం కేసీఆర్ నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని ప్రశాంతంగా ఉండేవారు. కానీ.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో.. సీఎం కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగింది. దీంతో వెంటనే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగేశారు. తన రాజకీయ చతురతను ఉపయోగించడం మొదలుపెట్టారు.
అందుకే రాబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న కసితో వ్యూహాలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నికల్లో ఆయనే రంగంలోకి దిగి ప్రణాళికలు రచిస్తున్నారు. సాగర్ ఉపఎన్నికలో గెలిస్తేనే టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉంటుందని.. లేకపోతే అది వచ్చే ఎన్నికల్లోనూ ఎఫెక్ట్ చూపిస్తుందని కేసీఆర్ కు అర్థం అయింది. అందుకే.. ప్రజల నమ్మకాన్ని, పార్టీ కేడర్ నమ్మకాన్ని గెలవాలంటే ఆయన ముందున్న ఒకే ఒక దారి సాగర్ ఉపఎన్నిక.
టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?
అయితే.. సాగర్ ఉపఎన్నిక అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అభ్యర్థి. అసలు.. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి ఎవరు బరిలో దిగుతారు.. అనేదానిపై పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. సాగర్ లో సానుభూతి వర్కవుట్ అవుతుందో లేదో అన్న అనుమానంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది.
ఎందుకంటే.. దుబ్బాకలో సానుభూతి వర్కవుట్ కాలేదు. అక్కడ బీజేపీ గెలిచింది. అందుకే.. నాగార్జునసాగర్ లోనూ సానుభూతిని నమ్ముకోకుండా.. నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్న నేతకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆచీతూచీ అడుగేస్తోంది.
నోముల కొడుకుకు టికెట్ లేనట్టే?
కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెగ్గి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగడంతో.. ఆయనను ఎదుర్కోవాలంటే నోముల కొడుకు భరత్ కు టికెట్ ఇస్తే సరిపోదని.. ఆయనకు కాకుండా.. జానారెడ్డి లాంటి స్ట్రాంగ్ నాయకుడికే టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఒకవేళ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దిగితే.. అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎవరో కాదు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి నాన్న. వాళ్లది నాగార్జున సాగర్. ఆయనకు స్థానికంగా మంచి పలుకుబడి ఉంది. అందుకే.. జానారెడ్డిని ఎదుర్కొని సాగర్ లో టీఆర్ఎస్ గెలవాలంటే.. చంద్రశేఖర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. చూద్దాం మరి.. ఈసారి సాగర్ ఉపఎన్నికలో ఎన్ని విచిత్రాలు జరగబోతున్నాయో?