“కోర్టు ధిక్కారణ” అంటూ ఏపీ హైకోర్టు వీరావేశం – స్పాట్ లో నిర్ణయం తీసుకున్న జడ్జి..!
ఏపీలోని పోలీస్ శాఖ ప్రమోషన్ల విషయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ హోంశాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజీత్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వీళ్లిద్దరిని కోర్టుకు హాజరు కావాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే సంవత్సరం జనవరి 25న హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశాలు జారీచేసింది.
అసలేం జరిగిందంటే?
ఏలూరులో ఎస్ఐగా ఉన్న రామారావు అనే పోలీస్ కు సీఐగా ప్రమోషన్ ఇచ్చే ప్యానల్ లో ప్లేస్ కల్పించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. హైకోర్టు ఆదేశాలను హోంశాఖ అమలు చేయలేదు. దీంతో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనకు ఇంకా ప్యానల్ లో స్థానం ఇవ్వలేదని.. ఎస్ఐ రామారావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కారణ కేసు కింద ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు… దీనిపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏలూరు రేంజ్ ఐజీ, డీజీపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తాజాగా కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు డీఐజీ తరుపు న్యాయవాది హాజరయ్యారు కానీ.. డీజీపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి తరుపున ఎవ్వరూ హాజరుకాలేదు. దీన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఎవ్వరూ హాజరుకాకపోవడం ఏంటి.. అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే విచారణకు హాజరు కావాలంటూ… రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది.