Etela Rajender : ఈటెల రాజేందర్‌తో రాజగోపాల్ రెడ్డిని పోల్చగలమా.?
Etela Rajender : ఈటెల రాజేందర్ బీసీ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడైతే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పారిశ్రామిక వేత్త. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వున్నట్లుగా ‘తెలంగాణ ఉద్యమకారుడు’ అన్న ఇమేజ్ రాజగోపాల్ రెడ్డికి లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికకీ, మునుగోడు ఉప ఎన్నికకీ ముడిపెట్టి, పోల్చి చూస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. అధికార పార్టీ నుంచి గెంటివేయబడ్డ ఉద్యమకారుడిగా ఈటెల రాజేందర్ మీదున్న సింపతీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తనంతట తానుగా బయటకు వచ్చి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎలా వస్తుంది.?
హుజూరాబాద్ రాజకీయం వేరు, మునుగోడు రాజకీయం వేరు. పైగా, ఏడాదిన్నర సమయం కూడా లేదు సాధారణ ఎన్నికలకి. ఈలోగా పార్టీ మారాల్సినంత తొందరేమొచ్చింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.? తానేదో త్యాగం చేసేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారుగానీ, ఈ క్రమంలో సింపతీ ఆయన వైపు కాకుండా, కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీ వైపు వెళుతోంది. ‘మమ్మల్ని ఏమైనా ఉద్ధరించావా.? ఇకపై ఉద్ధరిస్తావా.? నిన్నెంEtela Rajenderదుకు గెలిపించాలి.?’ అంటూ మునుగోడు ప్రజానీకం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. మునుగోడులో గనుక గెలిస్తే, వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ ప్రభావం చాలా ఎక్కువగా వుంటుందన్న ఆలోచనతో బీజేపీ వుండడం సహజమే. కానీ, అదే ఆలోచన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చేస్తుంది కదా.?
మునుగోడులో బీజేపీని గనుక టీఆర్ఎస్ దెబ్బ కొడితే, వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ అది బీజేపీకి శరాఘాతమే అవుతుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక, కాంగ్రెస్ పుంజుకోవడానికి కూడా మునుగోడు ఉప ఎన్నిక ఓ అవకాశం కల్పించిందన్న అభిప్రాయాలూ లేకపోలేదు. ఎలా చూసినా, ‘ఇది పార్టీల మధ్య పోరు కాదు, నాకూ కేసీయార్‌కీ మధ్య పోటీ..’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్న వాదన వీగిపోయేలానే కనిపిస్తోంది. ఈటెల తరహాలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ, బీజేపీలో ‘అదనపు గౌరవం’ పొందాలని చూస్తోన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో నిండా మునిగిపోయేందుకే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు రాజీనామా చేయగా, క్షణాల్లోనే ఆయన రాజీనామాకి ఆమోదం లభించింది. సో, మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడన్నదానిపై అధికారిక ప్రకటన రావడమొక్కటే తరువాయి అన్నమాట.