Health Tips | సన్‌స్క్రీన్ వాడిన వారికి విటమిన్ డి లోపం వస్తుందా.. నిపుణుల సమాధానం ఏంటంటే..!
Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే, దీన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి తగ్గిపోతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. సన్‌స్క్రీన్ అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ కల్పించడమే కాక, UVB కిరణాలను పూర్తిగా నిరోధించదు. ఈ UVB కిరణాల వల్లే శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి జరుగుతుంది.
అసలు విషయం ఏంటి?
అంటే, సన్‌స్క్రీన్ వాడినా సరే శరీరం కొంత మేరకు విటమిన్ డిని సృష్టించగలదు. కాబట్టి సన్‌స్క్రీన్ వాడకం వల్ల విటమిన్ డి లోపం వస్తుందన్న భయం అవసరం లేదు.నిపుణుల సూచనల ప్రకారం, వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు 10 నుంచి 30 నిమిషాల పాటు సూర్యరశ్మి పడే విధంగా ఉంటే సరిపోతుంది. ఇది విటమిన్ డి అవసరాలను తీరుస్తుంది. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య వెలుతురులో ఉండడం శ్రేయస్కరం.
విటమిన్ డి కోసం సన్‌స్క్రీన్‌ను వదిలేయడం సరైంది కాదు. ఎందుకంటే ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల చర్మం ముడతలు పడుతుంది, అకాల వృద్ధాప్యం వస్తుంది, చర్మ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ప్రతి రోజు సన్‌స్క్రీన్‌ను నిర్లక్ష్యం చేయకుండా వాడాలి. అంతేగాక, విటమిన్ డి కోసం చిన్న సమయంలో, సురక్షితంగా సూర్యరశ్మిని పొందాలి. అవసరమైతే డాక్టర్ సలహాతో విటమిన్ డి సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు.