YCP : ముందస్తు ఎన్నికలతో వైసీపీకి లాభమే.! కష్టమంతా విపక్షాలదే.!
YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హంగామా కనిపిస్తోంది. జనంలోకి వైసీపీ ప్రజా ప్రతినిథులు వెళ్ళడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత అగ్రెసివ్‌గా వ్యవహరిస్తుండడంతో, విపక్షాల్లో ఆందోళన బయల్దేరింది. కూటములు కట్టేందుకు విపక్షాలు నానా తంటాలూ పడుతున్నాయి. ఎవరు ఎవరితో కలవాలన్నదానిపై విపక్షాలు కిందా మీదా పడుతున్నాయి. ఆ పరిస్థితిని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పని తాను చేసుకుపోతున్నారు.
అదే సమయంలో, పార్టీ అధినేతగా పార్టీలోని కీలక నేతలకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. 175 సీట్లలోనూ గెలిచేలా పార్టీని బలోపేతం చేయాలని ఆదేశిస్తున్నారు. అందుకు తగ్గ కార్యాచరణని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. దాంతో, వైసీపీ నేతలు జనంలో, జనంతో బిజీగా వుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ప్రజల నుంచి వైసీపీ నేతలు కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మాట కూడా వాస్తవం. అయితే, ఎక్కడ తమకు వ్యతిరేకత వుందన్న విషయం తెలుసుకోవడానికి ఈ ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమం వైసీపీకి ఎంతగానో ఉపయోగపడనుంది. వైసీపీ చేపట్టిన ఈ ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ అట్టర్ ఫ్లాప్ అని విపక్షాలు జబ్బలు చరుచుకుంటున్నా,
ఆ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యమేంటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఇంతకీ, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.? రావా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చేందుకు అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే, విపక్షాలు ఎన్నికలకు సిద్ధంగా లేవు గనుక, ఈ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే అది అధికార వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ వ్యూహంతోనే వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకుంటే, విపక్షాలు ముచ్చట పడుతున్నట్లు ముందస్తు ఎన్నికలూ వస్తాయ్.. అధికార వైసీపీ, ఇంకోసారి అంతకు మించిన (2019కి మించిన) విజయాన్ని అందుకోవడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.