Eatala : సరికొత్త చరిత్ర నెలకొల్పిన ఈటల రాజేందర్
Eatala : తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ సరికొత్త చరిత్ర నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలకమైన భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా 2014 జూన్ 2 నుంచి అధికారికంగా మనుగడలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొన్న 2వ తేదీతో ఏడేళ్లు నిండాయి. ఈ ఏడేళ్ల కాలంలో శాసన సభ సభ్వత్యాన్ని తనకుతానుగా వదులుకున్నవారు ఎవరూ లేరు. ఆ రకంగా చూస్తే ఈటల రాజేందర్ పెద్ద సాహసం చేశారనే చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గతంలో కూడా రెండు సార్లు (2008, 2010) తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవిని వదులుకున్నారు. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు.
నిమిషాల్లో ఆమోదం..: Eatala
లేటెస్టుగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పిన ఈటల రాజేందర్ ఇవాళ శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పోస్టును కూడా వదులుకున్నారు. ఈటల రాజేందర్ చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నిమిషాల వ్యవధిలో ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభలో హుజూరాబాద్ సీటు ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి కూడా తెలియజేశారు. దీన్నిబట్టి ఉపఎన్నిక కోసం అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంత ఆరాటపడుతోందో అర్థమవుతోందని ప్రజలు అనుకుంటున్నారు.
17 ఏళ్లుగా..
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కంటిన్యూగా 17 ఏళ్లు పని చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తో తలెత్తిన వ్యక్తిగత, రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆయన భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనస్తాపానికి గురైన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
ఘనమైన చేరిక : Eatala
సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు ఘోరీ కట్టాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కి గానీ ఆయన దగ్గర ఉన్న వందలు, వేల కోట్ల రూపాయల డబ్బులకు గానీ తాను భయపడట్లేదని, రాష్ట్ర ప్రజల కోసం పోరాటం మొదలుపెడుతున్నానని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ ఎల్లుండు సోమవారం బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు పలువురు నాయకులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. కమలం పార్టీలో ఘనంగా చేరనున్నారు.