Nimmagadda Ramesh: నిమ్మగడ్డకి ‘ రెడ్డి గారి ‘ హుకుం , ఇక చేసేదేమీ లేక నిమ్మగడ్డ ఓటమి ?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ చేయాల్సిన ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నాడు. మరో వైపు సీఎం వైఎస్ జగన్ కూడా ఆపేసేందుకు ఏం చేయాలో అదే చేస్తున్నాడు. ప్రభుత్వం నుండి సహకారం అందదు అనే విషయం తెలిసి కూడా ఎన్నికల కమీషనర్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం చేశాడు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాల సహకారం తప్పనిసరి. వారు ఎన్నికల విధులు నిర్వహించకుంటే ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం అయ్యే పనే కాదు. దాంతో వైఎస్ జగన్ అనూహ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులతో నిమ్మగడ్డకు తిరుగుబాటు జెండా ఎగుర వేయిస్తున్నాడు. వారు కాదంటే నిమ్మగడ్డ ఎలా ఎన్నికల్లోకి వెళ్తాడో చూస్తాం అన్నట్లుగా వైకాపా నాయకులు అంటున్నారు.
నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన వెంకట్రామిరెడ్డి..
ఈమద్య కాలంలో ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఎన్నికల సంఘం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. ఒక వైపు కరోనా విజృంభిస్తుంది. మరో వైపు కరోనాకు వ్యాక్సినేషన్ జరుగుతుంది. అధికారులు అంతా కూడా ఆ విధుల్లో ఉంటే ఎన్నికల నిర్వహణ అవసరమా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ సమయంలో మేము ఎన్నికలకు సహకరించలేం అంటూ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. ఉద్యోగుల భద్రత మరియు ఆరోగ్యం మాకు అవసరం. అందుకోసమే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించలేం అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఉద్యోగులందరికి కూడా రెడ్డి గారు ఎన్నికల విధులకు హాజరు కావద్దంటూ హుకుం జారీ చేశారు.
నిమ్మగడ్డ ఇప్పుడేం చేస్తావ్..
ఉద్యోగులు ఎవరు కూడా సహకరించక పోవడంతో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం ఇక సాధ్యం కాదని నిమ్మగడ్డ చేతులు ఎత్తేసే అవకాశం ఉంది. చివరి ఆశగా నిమ్మగడ్డ రమేష్ సుప్రీం వైపు చూస్తున్నాడు. సుప్రీం కోర్టులో నేడు వచ్చే తీర్పు ఆధారంగానే నిమ్మగడ్డ భవిష్యత్తు ఎన్నికలు ఉండేది లేనిది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ మరి కొన్ని వారాల్లో రిటైర్ అవ్వబోతున్నాడు. అప్పటి వరకు ఎన్నికల పక్రియ ప్రారంభం అయితే ఆయన పదవి కాలం పొడగించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే చివరి నిమిషం వరకు నిమ్మగడ్డ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడేమో.