Etela Rajender : మరోసారి అసమ్మతి స్వరం వినిపించిన ఈటల?
Etela Rajender : తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్… గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక మంత్రి… తన ప్రభుత్వంపై, తన సొంత పార్టీపై ఇలాంటి విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలోనూ కదలికలు ప్రారంభం అయ్యాయి. ఈటల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగిందనేది తెలియకున్నా…. ఆయన వ్యాఖ్యలు మాత్రం హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.
ఈటల వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాజకీయాల్లో లేనిపోని అలజడులు ప్రారంభం కావడంతో… మంత్రి కేటీఆర్… ఈటలను సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యేలా చేశారు. ఈటల, కేసీఆర్.. ఇద్దరూ భేటీ అయి చర్చించుకున్నారు. దీంతో ఈ సమస్య ఇక తీరిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో… ఈటల రాజేందర్ మరో బాంబు పేల్చారు. మరోసారి ఆయన విరుచుకుపడ్డారు.
Etela Rajender : నేను మంత్రి కావచ్చు.. కానీ ముందు మనిషిని
ఈసందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్… నేను మంత్రిని కావచ్చు కానీ అంతకంటే మందు ఒక మనిషిని అన్నారు. రవీంద్రభారతిలో బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో మాట్లాడుతూ… ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు.అంబానీ సంపద పెరిగినంత మాత్రాన పేదరికం పోతుందా? సంపద కేంద్రీకృతం కావడమే పేదరికానికి కారణం. ఎలుకలు బాధిస్తున్నాయని ఇంటిని తగలబెట్టుకుంటామా? ఢిల్లీ రైతుల బాధ ఎప్పుడో ఒకప్పుడు నీ గడప కూడా తొక్కుతుంది. నేను మంత్రినే కానీ.. అంతకంటే ముందు ఒక మనిషిని.
మెరిట్ లేకుంటే టీచర్ కాలేరు. అలాగే మెరిట్ లేకుంటే మెడికల్ సీటు కూడా రాదు. అదే విధంగా పాలించే వాడికి కూడా ఒక మెరిట్ ఉండాలి. ప్రజల ఆకాంక్షలే పాలకుల కర్తవ్యం. మన రాజ్యాంగమే సక్రమంగా అమలు కావడం లేదు. ఉద్యమాలను ప్రజల కోసం చేస్తే… వారితో పాటు గొంతు కలపాల్సిందే.. అంటూ బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.